Yippude ne nemanna nidavayyeenaa

యిప్పుడే నే నేమన్న నితవయ్యీనా
Language

(॥పల్లవి॥)
యిప్పుడే నే నేమన్న నితవయ్యీనా
ముప్పిరి నాపె మీఁద మోహము నీకుండఁగా

(॥॥)
చాలుఁ జాలు దాని చేతి సణఁగు లెంతలేదు
పోలించి ఇంతలో నేల పొగడేవు
నాలికత్తె దానిమాట నమ్మితివా నీ వప్పుడె
మూలల ములిగే మేలు ముందరనె వున్నది

(॥॥)
నగకు నీ వంతదాని నాటకపుఁ జేఁతలకు
బిగిసి నీ వేల ఆనవెట్టు కొనేవు
మొగ మిచ్చలా పెడితే మొదలనే నిజమా
తగవులఁ బెట్ట నిన్ను దాఁ చుకుండీ గాక

(॥॥)
కరఁగకు నీవు దాని కౌఁగిటి రతులకును
కెరలి ఇంతలోఁ దమకించే వేల
ఇరవై శ్రీ వేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
తెరమరఁ గెల్లఁ బాసె తెలుసుకో ఇంకను.

(||pallavi||)
yippuḍe ne nemanna nidavayyīnā
muppiri nābĕ mīm̐da mohamu nīguṁḍam̐gā

(||||)
sālum̐ jālu dāni sedi saṇam̐gu lĕṁtaledu
poliṁchi iṁtalo nela pŏgaḍevu
nāligattĕ dānimāḍa nammidivā nī vappuḍĕ
mūlala mulige melu muṁdaranĕ vunnadi

(||||)
nagagu nī vaṁtadāni nāḍagabum̐ jem̐talagu
bigisi nī vela ānavĕṭṭu kŏnevu
mŏga michchalā pĕḍide mŏdalane nijamā
tagavulam̐ bĕṭṭa ninnu dām̐ suguṁḍī gāga

(||||)
karam̐gagu nīvu dāni kaum̐giḍi radulagunu
kĕrali iṁtalom̐ damagiṁche vela
iravai śhrī veṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
tĕramaram̐ gĕllam̐ bāsĕ tĕlusugo iṁkanu.