యిదివో మా విన్నపము ఇంతి భాగ్య మిటమీఁద
(॥పల్లవి॥)
యిదివో మా విన్నపము ఇంతి భాగ్య మిటమీఁద
గుదిగొన్న వేడుకలు కుప్పవడీని
(॥॥)
కొత్త కొత్త సిగ్గులతో కోమలి నీకు మోహించి
చిత్తము లోని మాటలు చెప్పఁజాలదు
ముత్తరపుఁ దమకము ముంచుకోఁగా నీ మేన
వొత్తుడై చెమట లెల్ల వూరఁ జొచ్చె నిపుడు
(॥॥)
వుడివోని యాసోదము లుమ్మగిలఁగా లోలో
తడఁబాటు విరహము దాఁచఁ జాలదు
బెడిదపుఁ గోరికలు పెనఁ గొనఁగా నిట్టే
కడలేని పులకలు కడు నుప్పతిల్లెను
(॥॥)
సెలవిఁ జేరు నవ్వులు చిందఁగా నిన్నుఁగూడి
అలమేలుమంగ పాయఁగఁ జాలదు
యెలమి శ్రీ వేంకటేశ యీకె మన్నించఁగాను
తలపోఁత కళలతో దైవారులు వారీని
(||pallavi||)
yidivo mā vinnabamu iṁti bhāgya miḍamīm̐da
gudigŏnna veḍugalu kuppavaḍīni
(||||)
kŏtta kŏtta siggulado komali nīgu mohiṁchi
sittamu loni māḍalu sĕppam̐jāladu
muttarabum̐ damagamu muṁchugom̐gā nī mena
vŏttuḍai sĕmaḍa lĕlla vūram̐ jŏchchĕ nibuḍu
(||||)
vuḍivoni yāsodamu lummagilam̐gā lolo
taḍam̐bāḍu virahamu dām̐sam̐ jāladu
bĕḍidabum̐ gorigalu pĕnam̐ gŏnam̐gā niṭṭe
kaḍaleni pulagalu kaḍu nuppadillĕnu
(||||)
sĕlavim̐ jeru navvulu siṁdam̐gā ninnum̐gūḍi
alamelumaṁga pāyam̐gam̐ jāladu
yĕlami śhrī veṁkaḍeśha yīgĕ manniṁcham̐gānu
talabom̐ta kaḽalado daivārulu vārīni