విన్నపమిదే నీకు వేవేలు విధముల
(॥పల్లవి॥)
విన్నపమిదే నీకు వేవేలు విధముల
నన్నుఁ గావవే హరి నమో నమో
(॥విన్నప॥)
నీగుణము నేనెరిఁగి నిన్నుఁ గొలువనేర
నాగుణము నీవెరిఁగి నన్ను నేలుకొనవయ్య
సాగరము నీవు దచ్చి సతిఁ దెచ్చుకొన్నట్టు
నాగశయనుఁడ హరి నమో నమో
(॥విన్నప॥)
నీవున్నచో టెరిఁగి నిన్నుఁ దలఁచనేర
నావున్నచో టెరుఁగుదు నన్ను నీవు దలఁచవే
కోవిదుఁడ నారఁ బేరుకొన్నవానిఁగాచినట్టు
నావొడయ హరిహరి నమో నమో
(॥విన్నప॥)
మనసులో నున్న నిన్ను మరవకుండ నేర
మనసులోని నీవే నామరపు దెలుపవయ్య
పనివడి యహల్యఁ బాదమునఁ గాచినట్టు
ననిచి శ్రీ వేంకటేశ నమో నమో
(||pallavi||)
vinnabamide nīgu vevelu vidhamula
nannum̐ gāvave hari namo namo
(||vinnaba||)
nīguṇamu nenĕrim̐gi ninnum̐ gŏluvanera
nāguṇamu nīvĕrim̐gi nannu nelugŏnavayya
sāgaramu nīvu dachchi sadim̐ dĕchchugŏnnaṭṭu
nāgaśhayanum̐ḍa hari namo namo
(||vinnaba||)
nīvunnaso ṭĕrim̐gi ninnum̐ dalam̐sanera
nāvunnaso ṭĕrum̐gudu nannu nīvu dalam̐save
kovidum̐ḍa nāram̐ berugŏnnavānim̐gāsinaṭṭu
nāvŏḍaya harihari namo namo
(||vinnaba||)
manasulo nunna ninnu maravaguṁḍa nera
manasuloni nīve nāmarabu dĕlubavayya
panivaḍi yahalyam̐ bādamunam̐ gāsinaṭṭu
nanisi śhrī veṁkaḍeśha namo namo