విన్నప మొక్కటే నీకు వేవేలకు
(॥పల్లవి॥)
విన్నప మొక్కటే నీకు వేవేలకు
మన్నించక నీకుఁ బోదు మా మనసు నీది
(॥విన్నప॥)
చేరి మొక్కే వారమూ సేవ సేసేవారమూ
యేరితి మాట లాడినా నే మాయ నీకు
నేరనివారు దిట్టితే నీకుఁ బోదు బుద్ది చెప్ప
భారము నీదే సు మ్మయ్య పడఁతినే నీకు
(॥విన్నప॥)
నీతోడివారమా నీసరివారమా నేము
యీతల నేఁ గైకొన్న నే మాయ నీకు
కాతరాన నే రా కున్నఁ గదియక నీకుఁ బోదు
నాతప్పులు నీవి సుమ్మీ నాపతిని నీవూ
(॥విన్నప॥)
కాంతుఁడ శ్రీవెంకటేశ కాఁగిటిలోని వారమూ
యెంత నిన్ను జంకించినా నే మాయ నీకు
అంతరంగ మైనవారి నాదరించ కిఁకఁ బోదు
పంతము నీది సుమ్మీ బడిదాన నేను
(||pallavi||)
vinnaba mŏkkaḍe nīgu vevelagu
manniṁchaga nīgum̐ bodu mā manasu nīdi
(||vinnaba||)
seri mŏkke vāramū seva sesevāramū
yeridi māḍa lāḍinā ne māya nīgu
neranivāru diṭṭide nīgum̐ bodu buddi sĕppa
bhāramu nīde su mmayya paḍam̐tine nīgu
(||vinnaba||)
nīdoḍivāramā nīsarivāramā nemu
yīdala nem̐ gaigŏnna ne māya nīgu
kādarāna ne rā kunnam̐ gadiyaga nīgum̐ bodu
nādappulu nīvi summī nābadini nīvū
(||vinnaba||)
kāṁtum̐ḍa śhrīvĕṁkaḍeśha kām̐giḍiloni vāramū
yĕṁta ninnu jaṁkiṁchinā ne māya nīgu
aṁtaraṁga mainavāri nādariṁcha kim̐kam̐ bodu
paṁtamu nīdi summī baḍidāna nenu