వెల్లివిరిసీ వలపు వెంట వెంట రాఁగాను
(॥పల్లవి॥)
వెల్లివిరిసీ వలపు వెంట వెంట రాఁగాను
యిల్లిదివో తలవంచే విఁక నేఁటిచింతలు
(॥వెల్లి॥)
గయ్యాళిమాటలాడి కన్నులు దేలవేయుచు
వొయ్యన నీమీఁదనిట్టె వొళ్లు వేసీని
పయ్యద జారఁగఁ జెలి పకపక నవ్వఁ జొచ్చె
ఇయ్యెడఁ దేరెఁ బనులు ఇఁకనేఁటిమాటలు
(॥వెల్లి॥)
గద్దించి నిన్నుఁ జూచి కాయమెల్లఁ జెమరించి
కొద్దిమీరఁ దొడమీఁదఁ గూచుండి
వుద్దండానఁ జెవిలోన వూరకె యేకతమాడీ
ఇద్దరిబాగులుఁ గంటినిఁక నేఁటి సుద్దులు
(॥వెల్లి॥)
మందెమేళాలు నెరపి మచ్చికతోఁ గాఁగిలించి
చిందేటిమోవితేనెలు చిప్పిలించి
కందువ శ్రీవేంకటేశ కలికి నిన్నుఁ గలిసీ
ఇందరి మోములు చూచి ఇఁకనేల సిగ్గులు
(||pallavi||)
vĕllivirisī valabu vĕṁṭa vĕṁṭa rām̐gānu
yillidivo talavaṁche vim̐ka nem̐ṭisiṁtalu
(||vĕlli||)
gayyāḽimāḍalāḍi kannulu delaveyusu
vŏyyana nīmīm̐daniṭṭĕ vŏḽlu vesīni
payyada jāram̐gam̐ jĕli pagabaga navvam̐ jŏchchĕ
iyyĕḍam̐ derĕm̐ banulu im̐kanem̐ṭimāḍalu
(||vĕlli||)
gaddiṁchi ninnum̐ jūsi kāyamĕllam̐ jĕmariṁchi
kŏddimīram̐ dŏḍamīm̐dam̐ gūsuṁḍi
vuddaṁḍānam̐ jĕvilona vūragĕ yegadamāḍī
iddaribāgulum̐ gaṁṭinim̐ka nem̐ṭi suddulu
(||vĕlli||)
maṁdĕmeḽālu nĕrabi machchigadom̐ gām̐giliṁchi
siṁdeḍimovidenĕlu sippiliṁchi
kaṁduva śhrīveṁkaḍeśha kaligi ninnum̐ galisī
iṁdari momulu sūsi im̐kanela siggulu