వెల్లవిరులాయ నేఁడు వేడుక నీ చేఁతలెల్లా
(॥పల్లవి॥)
వెల్లవిరులాయ నేఁడు వేడుక నీ చేఁతలెల్లా
యెల్లవారు సంతోసాన నిట్టె మెచ్చిరయ్యా
(॥వెల్ల॥)
ములువాఁడి చెనకులు మోవిమీఁద నుండగాఁనే
వలపేల దాఁచేవు వద్దివారితో
చలపల చెమటలు చెక్కులపైఁ గారఁగానే
నెలకొన్న సిగ్గులు నీకేలయ్యా
(॥వెల్ల॥)
గుఱుతైన వెడజారు కొప్పున నుండెంగానే
మఱఁగేల పెట్టేవు మగువలకు
కఱఁగిన భావములు కన్నులలో నుండఁగానే
చిఱునవ్వుతోనేల చిమ్మిరేఁగీవయ్యా
(॥వెల్ల॥)
మునుకొన్న కళలెల్లా మోమునఁ దేరఁగానే
కను సన్నేల సేసేవు కడవారికి
యనసితివి శ్రీవేంకటేశ మమ్ము నిక్కడనే
అనుమానములతోడి ఆన లేఁటికయ్యా
(||pallavi||)
vĕllavirulāya nem̐ḍu veḍuga nī sem̐talĕllā
yĕllavāru saṁtosāna niṭṭĕ mĕchchirayyā
(||vĕlla||)
muluvām̐ḍi sĕnagulu movimīm̐da nuṁḍagām̐ne
valabela dām̐sevu vaddivārido
salabala sĕmaḍalu sĕkkulabaim̐ gāram̐gāne
nĕlagŏnna siggulu nīgelayyā
(||vĕlla||)
guṟudaina vĕḍajāru kŏppuna nuṁḍĕṁgāne
maṟam̐gela pĕṭṭevu maguvalagu
kaṟam̐gina bhāvamulu kannulalo nuṁḍam̐gāne
siṟunavvudonela simmirem̐gīvayyā
(||vĕlla||)
munugŏnna kaḽalĕllā momunam̐ deram̐gāne
kanu sannela sesevu kaḍavārigi
yanasidivi śhrīveṁkaḍeśha mammu nikkaḍane
anumānamuladoḍi āna lem̐ṭigayyā