(॥పల్లవి॥)
వెలలేని మహిమల వేసాలవాఁడు
పలుకు లీడేరె నిఁక భావించనేఁటికి
(॥వెల॥)
చెలిమి చేసినవాఁడు చేతికి లోనౌఁగాక
పిలువఁగానే నాతో పెనఁగనేలే
కలువల వేసినాఁడు కాఁగిలించుకొనుఁగాక
యెలఇంపుఁజేఁతలతో నెక్కడ చూచీనే
(॥వెల॥)
తగులనాడినవాఁడు తనివి నొందించుఁగాక
జిగిఁ జేఇ వట్టఁగానే సిగ్గులింతేలే
నగినాఁడు మొదలనే నాటుకొని వుండుఁగాక
మొగమెదుటనే యేల మోహము దాఁచీనే
(॥వెల॥)
చెనకి కూడినవాఁడు చిత్తగించ మెచ్చుఁగాక
పనివడి మొక్కఁగానే పరాకులేలే
యెనసె శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
చనవిచ్చి మరియేమి చాయలు దిద్దీనే
(||pallavi||)
vĕlaleni mahimala vesālavām̐ḍu
palugu līḍerĕ nim̐ka bhāviṁchanem̐ṭigi
(||vĕla||)
sĕlimi sesinavām̐ḍu sedigi lonaum̐gāga
piluvam̐gāne nādo pĕnam̐ganele
kaluvala vesinām̐ḍu kām̐giliṁchugŏnum̐gāga
yĕla̮iṁpum̐jem̐talado nĕkkaḍa sūsīne
(||vĕla||)
tagulanāḍinavām̐ḍu tanivi nŏṁdiṁchum̐gāga
jigim̐ jei vaṭṭam̐gāne sigguliṁtele
naginām̐ḍu mŏdalane nāḍugŏni vuṁḍum̐gāga
mŏgamĕduḍane yela mohamu dām̐sīne
(||vĕla||)
sĕnagi kūḍinavām̐ḍu sittagiṁcha mĕchchum̐gāga
panivaḍi mŏkkam̐gāne parāgulele
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
sanavichchi mariyemi sāyalu diddīne