Vedavatti yimka nemi vedageru sadiveru

వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
Language

(॥పల్లవి॥)
వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా

(॥వేద॥)
తోలె నదె గరుడనిఁ దొడఁగి బాణునిమీఁద
వాలెను కంసునిమీఁద వడి నెగసి
కేలుచాఁచి చక్రమునఁ గెడపె శిశుపాలుని
వేలుపులరాయఁడైన విష్ణుని నెఱఁగరా

(॥వేద॥)
తొక్కెను బలీంద్రునిఁ దొల్లి పాతాళానఁ గుంగ
మొక్కలాన జలధమ్ముమొనకుఁ దెచ్చె
పక్కన బ్రహ్మాండము పగులించెఁ బెనువేల
వెక్కసపుదైవమైన విష్ణుని నెఱఁగరా

(॥వేద॥)
భేదించె రావణాది భీకరదైత్యుల నెల్ల
నాదించె శంఖమున నున్నతజయము
సేదదేర నిపుడును శ్రీవేంకటాద్రిమీఁద
వీదివీది మెరసేటి విష్ణుని నెఱఁగరా

(||pallavi||)
vedavaṭṭi yim̐ka nemi vĕdageru sadiveru
vedāṁtavedyum̐ḍaina viṣhṇuni nĕṟam̐garā

(||veda||)
tolĕ nadĕ garuḍanim̐ dŏḍam̐gi bāṇunimīm̐da
vālĕnu kaṁsunimīm̐da vaḍi nĕgasi
kelusām̐si sakramunam̐ gĕḍabĕ śhiśhubāluni
velubularāyam̐ḍaina viṣhṇuni nĕṟam̐garā

(||veda||)
tŏkkĕnu balīṁdrunim̐ dŏlli pādāḽānam̐ guṁga
mŏkkalāna jaladhammumŏnagum̐ dĕchchĕ
pakkana brahmāṁḍamu paguliṁchĕm̐ bĕnuvela
vĕkkasabudaivamaina viṣhṇuni nĕṟam̐garā

(||veda||)
bhediṁchĕ rāvaṇādi bhīgaradaityula nĕlla
nādiṁchĕ śhaṁkhamuna nunnadajayamu
sedadera nibuḍunu śhrīveṁkaḍādrimīm̐da
vīdivīdi mĕraseḍi viṣhṇuni nĕṟam̐garā