వలసినప్పుడు తానే వచ్చీఁ గాని
(॥పల్లవి॥)
వలసినప్పుడు తానే వచ్చీఁ గాని
చలపట్టి మీరేల సాదించేరు రారే
(॥వల॥)
చిత్తము లోపలిప్రేమ చెప్పి చూపవచ్చునా
హత్తినచూపులఁ గాననగుఁగాక
తత్తరీఁడు తనలోనితలఁపెల్లాఁ దెలిసెను
కొత్తలుగా మీరేల కొసరేరు రారే
(॥వల॥)
అప్పటి మొగమొటాలు అవియే తేవచ్చునా
మెప్పించినవేళలను మించుఁగాక
ముప్పిరి నుబ్బరికాఁడు మోహమెల్లాఁ దెలిసెను
వుప్పటించి కడునేల వొరసేరు రారే
(॥వల॥)
వేడుకులు గలన్నియు వేరేవుంటేఁ దోఁచునా
కూడిన కాఁగిటిలోనే గుఱుతవుఁగాక
యీడనె శ్రీవేంకటేశుఁ డెనసెఁ దా విచ్చేసి
ఆడనే దూరక మీరు అండకిట్టె రారే
(||pallavi||)
valasinappuḍu tāne vachchīm̐ gāni
salabaṭṭi mīrela sādiṁcheru rāre
(||vala||)
sittamu lobaliprema sĕppi sūbavachchunā
hattinasūbulam̐ gānanagum̐gāga
tattarīm̐ḍu tanalonidalam̐pĕllām̐ dĕlisĕnu
kŏttalugā mīrela kŏsareru rāre
(||vala||)
appaḍi mŏgamŏḍālu aviye tevachchunā
mĕppiṁchinaveḽalanu miṁchum̐gāga
muppiri nubbarigām̐ḍu mohamĕllām̐ dĕlisĕnu
vuppaḍiṁchi kaḍunela vŏraseru rāre
(||vala||)
veḍugulu galanniyu verevuṁṭem̐ dom̐sunā
kūḍina kām̐giḍilone guṟudavum̐gāga
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕm̐ dā vichchesi
āḍane dūraga mīru aṁḍagiṭṭĕ rāre