వచ్చి వచ్చి రమణుఁడు వాకిట నేల నిలిచె
(॥పల్లవి॥)
వచ్చి వచ్చి రమణుఁడు వాకిట నేల నిలిచె
తచ్చనలెల్లాఁ దెలిపె దగ్గరి రమ్మనవే
(॥వచ్చి॥)
వలచిన యట్టివారు వడినేమి యాడినాను
మలసి నవ్వుట గాక మంకులేఁటికి
చలములు సాదించ సవతిపోరాయేమి
తలఁపులో కొదదీర్చె దగ్గరి రమ్మనవే
(॥వచ్చి॥)
కొమెరపాయపువారు కొచ్చి కొచ్చి పెనఁగితే
జమళిఁ గైకొంటగాక సటలేఁటికి
వుమురఁ బెట్టగ నట్టె వుక్కిసకూడాయేమి
తమకము చెల్లఁబెట్టె దగ్గరి రమ్మనవే
(॥వచ్చి॥)
పొత్తుగూడినట్టివారు పొదిగి కాగిలలించితే
హత్తి మెచ్చవలెగాఁక ఆనలేఁటికి
వొత్తి శ్రీవేంకటేశుఁడు వొడివట్టి నన్నుఁగూడె
తత్తరీఁడు మాటచెప్పె దగ్గరి రమ్మనవే
(||pallavi||)
vachchi vachchi ramaṇum̐ḍu vāgiḍa nela nilisĕ
tachchanalĕllām̐ dĕlibĕ daggari rammanave
(||vachchi||)
valasina yaṭṭivāru vaḍinemi yāḍinānu
malasi navvuḍa gāga maṁkulem̐ṭigi
salamulu sādiṁcha savadiborāyemi
talam̐pulo kŏdadīrsĕ daggari rammanave
(||vachchi||)
kŏmĕrabāyabuvāru kŏchchi kŏchchi pĕnam̐gide
jamaḽim̐ gaigŏṁṭagāga saḍalem̐ṭigi
vumuram̐ bĕṭṭaga naṭṭĕ vukkisagūḍāyemi
tamagamu sĕllam̐bĕṭṭĕ daggari rammanave
(||vachchi||)
pŏttugūḍinaṭṭivāru pŏdigi kāgilaliṁchide
hatti mĕchchavalĕgām̐ka ānalem̐ṭigi
vŏtti śhrīveṁkaḍeśhum̐ḍu vŏḍivaṭṭi nannum̐gūḍĕ
tattarīm̐ḍu māḍasĕppĕ daggari rammanave