తెలియదు నీ మనసు దేవోత్తమా
(॥పల్లవి॥)
తెలియదు నీ మనసు దేవోత్తమా
సులభుండవని విని చొరఁబారీ మనసు
(॥తెలి॥)
చూతును నీ మూరితిని చొప్పుగాఁ గన్నులెదుట
ఆతుమలోఁ దలపోనే ననుచును అలవరచుకొందును
నీతి యెంచి చూచితేను నీ వెంత నే నెంత
యీతల నా యగ్గలికెకు నే మనుచున్నాఁడవో
(॥తెలి॥)
నెట్టుకొనఁ బూజింతు నీవు నా వాఁడవే యంటా
పెట్టెలోన నుంచి చక్కఁ బెట్టుకొందును
యెట్టిది నా సాహసంబు యేమిటి నిన్ను మెప్పించితి
నట్టనడుమ నన్నెట్టు నవ్వుతా వున్నాఁడవో
(॥తెలి॥)
నొడిగి నిన్నుఁ బిలుతు నోరునిండాఁ బేరుకొని
యెడయ కెందున్నాఁడవొ యెక్కడెక్కడ
అడరి శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి
వడి నన్నేలితి వెటువంటి సుకృతివో
(||pallavi||)
tĕliyadu nī manasu devottamā
sulabhuṁḍavani vini sŏram̐bārī manasu
(||tĕli||)
sūdunu nī mūridini sŏppugām̐ gannulĕduḍa
ādumalom̐ dalabone nanusunu alavarasugŏṁdunu
nīdi yĕṁchi sūsidenu nī vĕṁta ne nĕṁta
yīdala nā yaggaligĕgu ne manusunnām̐ḍavo
(||tĕli||)
nĕṭṭugŏnam̐ būjiṁtu nīvu nā vām̐ḍave yaṁṭā
pĕṭṭĕlona nuṁchi sakkam̐ bĕṭṭugŏṁdunu
yĕṭṭidi nā sāhasaṁbu yemiḍi ninnu mĕppiṁchidi
naṭṭanaḍuma nannĕṭṭu navvudā vunnām̐ḍavo
(||tĕli||)
nŏḍigi ninnum̐ biludu noruniṁḍām̐ berugŏni
yĕḍaya kĕṁdunnām̐ḍavŏ yĕkkaḍĕkkaḍa
aḍari śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
vaḍi nannelidi vĕḍuvaṁṭi sukṛtivo