తన వోజ మానఁడు తప్పు లాతనికి లేవు
(॥పల్లవి॥)
తన వోజ మానఁడు తప్పు లాతనికి లేవు
పెనఁగఁగ బెనఁగఁగ బీరమే కలది
(॥తన॥)
సారె మీరు చెప్పఁగాను చలపట్టి పోరఁగాను
కూరిమిఁ గొసరఁగాను కోపగించేనా
మేరమీరినాతఁడు మిందుఁగిందు నెంచఁడు
తారుకాణించగఁబోతే తగవులే కలవి
(॥తన॥)
అందాలు మీరు చెప్పఁగా నట్టె వేఁడుకొనఁగా
విందువలె మొక్కఁగాను వెగ్గళించేనా
మందెమేళమే యాతఁడు మానఁడు తన గుణాలు
అందుకు నౌఁగాదంటే నానలే కలవి
(॥తన॥)
పనివడి మీరనఁగా పంతాలు సరిసేయఁగా
చనవులు చెల్లించగా సాదించేనా
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నిట్టె
ననుపు నటించఁగాను నవ్వులే గలవి
(||pallavi||)
tana voja mānam̐ḍu tappu lādanigi levu
pĕnam̐gam̐ga bĕnam̐gam̐ga bīrame kaladi
(||tana||)
sārĕ mīru sĕppam̐gānu salabaṭṭi poram̐gānu
kūrimim̐ gŏsaram̐gānu kobagiṁchenā
meramīrinādam̐ḍu miṁdum̐giṁdu nĕṁcham̐ḍu
tārugāṇiṁchagam̐bode tagavule kalavi
(||tana||)
aṁdālu mīru sĕppam̐gā naṭṭĕ vem̐ḍugŏnam̐gā
viṁduvalĕ mŏkkam̐gānu vĕggaḽiṁchenā
maṁdĕmeḽame yādam̐ḍu mānam̐ḍu tana guṇālu
aṁdugu naum̐gādaṁṭe nānale kalavi
(||tana||)
panivaḍi mīranam̐gā paṁtālu sariseyam̐gā
sanavulu sĕlliṁchagā sādiṁchenā
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu niṭṭĕ
nanubu naḍiṁcham̐gānu navvule galavi