తల వంచుకొననేల దండవే వున్నాఁ డాతఁడు
(॥పల్లవి॥)
తల వంచుకొననేల దండవే వున్నాఁ డాతఁడు
చెలఁగి నోరార నీవే సేయవే విన్నపాలు
(॥॥)
తలపోఁ త లెక్కుడైతే తాలిమి గలుగునా
చలము సాదించఁ బోతే సరసమౌనా
సొలపులే తరచైతే సొగయునా నేస్తాలు
పిలిచి మాటాడఁగదే ప్రియునితో నీవు
(॥॥)
వట్టిగుట్టున నుంటేను వాడిక లొనగూడునా
దిట్టతనమే పెంచితేఁ బుట్టునా దయ
నెట్టుకొన్న సిగ్గులైతే నిలుచునా మచ్చికలు
చుట్టరికము లెల్లాను చూపవే మగనికి
(॥॥)
పంతములె నెరపితే భావములు గరఁగునా
వంతువాసు లెంచితేనే వలపంటునా
వింతగా నలమేల్మంగ విభుఁడు శ్రీవేంకటేశుఁ -
డింతలో నిన్నేలె మెచ్చి ఇచ్చకములాడవే
(||pallavi||)
tala vaṁchugŏnanela daṁḍave vunnām̐ ḍādam̐ḍu
sĕlam̐gi norāra nīve seyave vinnabālu
(||||)
talabom̐ ta lĕkkuḍaide tālimi galugunā
salamu sādiṁcham̐ bode sarasamaunā
sŏlabule tarasaide sŏgayunā nestālu
pilisi māḍāḍam̐gade priyunido nīvu
(||||)
vaṭṭiguṭṭuna nuṁṭenu vāḍiga lŏnagūḍunā
diṭṭadaname pĕṁchidem̐ buṭṭunā daya
nĕṭṭugŏnna siggulaide nilusunā machchigalu
suṭṭarigamu lĕllānu sūbave maganigi
(||||)
paṁtamulĕ nĕrabide bhāvamulu garam̐gunā
vaṁtuvāsu lĕṁchidene valabaṁṭunā
viṁtagā nalamelmaṁga vibhum̐ḍu śhrīveṁkaḍeśhum̐ -
ḍiṁtalo ninnelĕ mĕchchi ichchagamulāḍave