తక్కక యాదరింతు వీ తరుణి నెప్పుడు నీవు
(॥పల్లవి॥)
తక్కక యాదరింతు వీ తరుణి నెప్పుడు నీవు
వొక్కరీతినే చనవొసఁగవయ్యా
(॥తక్క॥)
మక్కువ నీతో నాపె మాటలాడీ వినవయ్య
చిక్కనితేనెలు మోవిఁ జిందఁగాను
చెక్కులచెమటతోడఁ జేసీ కొలువు నీకు
మిక్కిలివేడుక మతి మెఱయఁగను
(॥తక్క॥)
నంటున నీతో నిట్టే నవ్వీఁ జిత్తగించవయ్య
జంటలై దంతకాంతులు సారె మించఁగా
అంటిముట్టి వూడిగము లప్పటిఁ జేసీ నీకు
పెంటలై నపులకలు పెనగొనఁగాను
(॥తక్క॥)
సోలపుఁజూపుల నిన్నుఁజూచీఁ గనుఁ గొనవయ్య
తళుకురెప్పలమించు దైవారఁగాను
చెలియలమేల్మంగను శ్రీవేంకటేశ కూడితి-
విల నీపె తనబత్తి యిరవుకోఁగాను
(||pallavi||)
takkaga yādariṁtu vī taruṇi nĕppuḍu nīvu
vŏkkarīdine sanavŏsam̐gavayyā
(||takka||)
makkuva nīdo nābĕ māḍalāḍī vinavayya
sikkanidenĕlu movim̐ jiṁdam̐gānu
sĕkkulasĕmaḍadoḍam̐ jesī kŏluvu nīgu
mikkiliveḍuga madi mĕṟayam̐ganu
(||takka||)
naṁṭuna nīdo niṭṭe navvīm̐ jittagiṁchavayya
jaṁṭalai daṁtagāṁtulu sārĕ miṁcham̐gā
aṁṭimuṭṭi vūḍigamu lappaḍim̐ jesī nīgu
pĕṁṭalai nabulagalu pĕnagŏnam̐gānu
(||takka||)
solabum̐jūbula ninnum̐jūsīm̐ ganum̐ gŏnavayya
taḽugurĕppalamiṁchu daivāram̐gānu
sĕliyalamelmaṁganu śhrīveṁkaḍeśha kūḍidi-
vila nībĕ tanabatti yiravugom̐gānu