చూతువు విచ్చేయవయ్య సుద్దులు చెప్పగనేల
(॥పల్లవి॥)
చూతువు విచ్చేయవయ్య సుద్దులు చెప్పగనేల
రాతిరిఁ బగలు జాగరములాయను
(॥చతు॥)
ముంచిన వలపు తలమునుకలై వనితకు
దించినట్టు కొప్పువీడి దిగజారెను
యెంచరానితమకము ఇగిరించినట్టు మేనఁ
జంచులపులకలెల్ల జాజుకొనెను
(॥చతు॥)
తగినచింతాసముద్రానఁ గోరిక వోడ
దిగినయట్టు చెక్కుచేతికి వచ్చెను
పగటున నిధానాలు బయటఁ బడినయట్టు
సగముపయ్యెదెడలి చన్నులు మెరసెను
(॥చతు॥)
కందువఁ దనభాగ్యము కాఁగిట నిలిచినట్టు
పొందితి శ్రీవేంకటేశ పొలిఁతి నిట్టె
అందె అలమేలుమంగ నప్పటి లోనింటి కేఁగి
కందువ చెప్పెంపినట్టు కాంతలఁ బుత్తెంచెను
(||pallavi||)
sūduvu vichcheyavayya suddulu sĕppaganela
rādirim̐ bagalu jāgaramulāyanu
(||sadu||)
muṁchina valabu talamunugalai vanidagu
diṁchinaṭṭu kŏppuvīḍi digajārĕnu
yĕṁcharānidamagamu igiriṁchinaṭṭu menam̐
jaṁchulabulagalĕlla jājugŏnĕnu
(||sadu||)
taginasiṁtāsamudrānam̐ goriga voḍa
diginayaṭṭu sĕkkusedigi vachchĕnu
pagaḍuna nidhānālu bayaḍam̐ baḍinayaṭṭu
sagamubayyĕdĕḍali sannulu mĕrasĕnu
(||sadu||)
kaṁduvam̐ danabhāgyamu kām̐giḍa nilisinaṭṭu
pŏṁdidi śhrīveṁkaḍeśha pŏlim̐ti niṭṭĕ
aṁdĕ alamelumaṁga nappaḍi loniṁṭi kem̐gi
kaṁduva sĕppĕṁpinaṭṭu kāṁtalam̐ buttĕṁchĕnu