చిత్తాన నోరుపు లేదు విడువఁజాలవు
(॥పల్లవి॥)
చిత్తాన నోరుపు లేదు విడువఁజాలవు
హత్తి నిన్ను నేమందు నౌదువయ్యా జాణవు
(॥॥)
మోము చూచితే ముసిముసినవ్వులు నవ్వేవు
కామించి తలవంచితే కాతరించేవు
గోమునఁ జెనకితేను కొంకి సాములు నేసేవు
నేమమున నుండితేను నిక్కి పైకొనేవు
(॥॥)
ఆనుక మాటలాడితే నటు గుట్టు చూపేవు
మోనాన నుండితే చను మొన లంటేవు
కానుక లిచ్చితేను నలుగడలునుఁ జూచేవు
మాని వూరకుండితేను మంతనమాడేవు
(॥॥)
సేవలు సేయవచ్చితే చేతు లొడ్డించుకొనేవు
వోవరిలొఁబండుండితే నొడివట్టేవు
యీవేళ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
వావులు చెప్పినంతనే వలపులఁజిక్కేవు
(||pallavi||)
sittāna norubu ledu viḍuvam̐jālavu
hatti ninnu nemaṁdu nauduvayyā jāṇavu
(||||)
momu sūside musimusinavvulu navvevu
kāmiṁchi talavaṁchide kādariṁchevu
gomunam̐ jĕnagidenu kŏṁki sāmulu nesevu
nemamuna nuṁḍidenu nikki paigŏnevu
(||||)
ānuga māḍalāḍide naḍu guṭṭu sūbevu
monāna nuṁḍide sanu mŏna laṁṭevu
kānuga lichchidenu nalugaḍalunum̐ jūsevu
māni vūraguṁḍidenu maṁtanamāḍevu
(||||)
sevalu seyavachchide sedu lŏḍḍiṁchugŏnevu
vovarilŏm̐baṁḍuṁḍide nŏḍivaṭṭevu
yīveḽa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
vāvulu sĕppinaṁtane valabulam̐jikkevu