శ్రీ వేంకటేశ్వరునికి చెలి యలమేలుమంగ
(॥పల్లవి॥)
శ్రీ వేంకటేశ్వరునికి చెలి యలమేలుమంగ
వోవరిగా నెలకొని వురముపైనున్నది
(॥శ్రీ వేం॥)
పొంచి మచ్చ మైననాఁటి పొలసు కంపులు వాయ
సంచులఁ బన్నీట మజ్జన మార్పరే
అంచెఁ గూర్మ వరహములైనట్టి సొగటుదీర
మించఁ గప్పుర ధూళి మెత్తరే మేనను
(॥శ్రీ వేం॥)
నరసింహపు గదరు నాఁటి వామనపు జిడ్డు
పరశురామునిగబ్బు పచ్చివీడను
పరిమళముగట్టిన బంగారుగిన్నెఁ దెచ్చి
పొరిఁ దిరుమేనఁ దట్టుపునుఁగిట్టె నించరే
(॥శ్రీ వేం॥)
గొల్లముంజురాచజడ్డు కోరి బుద్ధుడైన సిగ్గు
చొల్లుగుఱ్ఱపు నూఁగురొచ్చులు మానునా
ఇల్లిదె శ్రీ వేంకటేశుఁడీరూపై తానున్నవాఁడు
యెల్లపూదండలు సొమ్ములెక్కించరే
(||pallavi||)
śhrī veṁkaḍeśhvarunigi sĕli yalamelumaṁga
vovarigā nĕlagŏni vuramubainunnadi
(||śhrī veṁ||)
pŏṁchi machcha mainanām̐ṭi pŏlasu kaṁpulu vāya
saṁchulam̐ bannīḍa majjana mārbare
aṁchĕm̐ gūrma varahamulainaṭṭi sŏgaḍudīra
miṁcham̐ gappura dhūḽi mĕttare menanu
(||śhrī veṁ||)
narasiṁhabu gadaru nām̐ṭi vāmanabu jiḍḍu
paraśhurāmunigabbu pachchivīḍanu
parimaḽamugaṭṭina baṁgāruginnĕm̐ dĕchchi
pŏrim̐ dirumenam̐ daṭṭubunum̐giṭṭĕ niṁchare
(||śhrī veṁ||)
gŏllamuṁjurāsajaḍḍu kori buddhuḍaina siggu
sŏlluguṭrabu nūm̐gurŏchchulu mānunā
illidĕ śhrī veṁkaḍeśhum̐ḍīrūbai tānunnavām̐ḍu
yĕllabūdaṁḍalu sŏmmulĕkkiṁchare