సేయఁగల పని మరి చెప్పవుగాని
(॥పల్లవి॥)
సేయఁగల పని మరి చెప్పవుగాని
చాయలా సన్నలా సరసములాడవయ్యా
(॥సేయఁ॥)
నెలఁత నెత్తములాడి నీవు రాఁగా సిగ్గుపడి
చెలిమాటున నున్నది చెక్కుచేతితో
కలికిఁ గాఁగిటఁబట్టి గక్కనఁ దోడితెచ్చి
యెలమి నాపెకు నీవు యెత్తు చెప్పవయ్యా
(॥సేయఁ॥)
యింతి కిన్నెర వాయించి యిట్టె నిన్నుఁగని వేచి
చెంతనే నిలుచున్నది శిరసు వంచి
సంతోసాన నాపెఁ దెచ్చి సరుసఁ గూచుండఁ బెట్టి
పంతమెక్కించి వాయించి పాడించవయ్యా
(॥సేయఁ॥)
భామ పరపుపైనుండి పక్కన నిన్ను జూచి
మోమెత్తి నవ్వులు నవ్వే ముదమలర
కామించి శ్రీవేంకటేశ కాఁగిలించి కూడితివి
చేముట్టి పవ్వళింపించి సేదదేరుచవయ్యా
(||pallavi||)
seyam̐gala pani mari sĕppavugāni
sāyalā sannalā sarasamulāḍavayyā
(||seyam̐||)
nĕlam̐ta nĕttamulāḍi nīvu rām̐gā siggubaḍi
sĕlimāḍuna nunnadi sĕkkusedido
kaligim̐ gām̐giḍam̐baṭṭi gakkanam̐ doḍidĕchchi
yĕlami nābĕgu nīvu yĕttu sĕppavayyā
(||seyam̐||)
yiṁti kinnĕra vāyiṁchi yiṭṭĕ ninnum̐gani vesi
sĕṁtane nilusunnadi śhirasu vaṁchi
saṁtosāna nābĕm̐ dĕchchi sarusam̐ gūsuṁḍam̐ bĕṭṭi
paṁtamĕkkiṁchi vāyiṁchi pāḍiṁchavayyā
(||seyam̐||)
bhāma parabubainuṁḍi pakkana ninnu jūsi
momĕtti navvulu navve mudamalara
kāmiṁchi śhrīveṁkaḍeśha kām̐giliṁchi kūḍidivi
semuṭṭi pavvaḽiṁpiṁchi sedaderusavayyā