చెప్పినట్టల్లా నీకుఁ జేసేనయ్యా
(॥పల్లవి॥)
చెప్పినట్టల్లా నీకుఁ జేసేనయ్యా
తప్పులుఁ దారులు మరి తలఁచకువయ్యా
(॥చెప్పి॥)
చెనకిన దాననై చేరి మొక్కే నదివో
మనసులో చలములు మానవయ్య
పెనఁగినదాననై ప్రియము చెప్పే నేను
యెనలేని బీరములు ఇఁక నేలయ్యా
(॥చెప్పి॥)
తిట్టిన నోరనే దీవించే నిదివో
రట్టు సేయ కిఁక నీ విట్టె రావయ్య
పట్టిన పంతము మేనఁ బనిసేసె నిదివో
ఇట్టు నట్టు మారుమాఁట లిఁకనేలయ్యా
(॥చెప్పి॥)
కడుఁ జాఁచిన చేతనే కాఁగిలించే నిదివో
నడుమఁ గూడితి విట్టె నవ్వవయ్యా
అడరి శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
సడిదీర బొందితిని సంతోసించవయ్యా
(||pallavi||)
sĕppinaṭṭallā nīgum̐ jesenayyā
tappulum̐ dārulu mari talam̐saguvayyā
(||sĕppi||)
sĕnagina dānanai seri mŏkke nadivo
manasulo salamulu mānavayya
pĕnam̐ginadānanai priyamu sĕppe nenu
yĕnaleni bīramulu im̐ka nelayyā
(||sĕppi||)
tiṭṭina norane dīviṁche nidivo
raṭṭu seya kim̐ka nī viṭṭĕ rāvayya
paṭṭina paṁtamu menam̐ banisesĕ nidivo
iṭṭu naṭṭu mārumām̐ṭa lim̐kanelayyā
(||sĕppi||)
kaḍum̐ jām̐sina sedane kām̐giliṁche nidivo
naḍumam̐ gūḍidi viṭṭĕ navvavayyā
aḍari śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
saḍidīra bŏṁdidini saṁtosiṁchavayyā