చెప్ప నరుదాయఁగదె చెలిసింగారము నేఁడు
(॥పల్లవి॥)
చెప్ప నరుదాయఁగదె చెలిసింగారము నేఁడు
నొప్పగు మరుబండార మొనగూర్చినట్లు
(॥॥)
తొడిఁబడ సేమంతులు దురిమెఁ గొప్పునఁజెలి
కడుఁజీఁకటీ వెన్నెలాఁ గలసినట్లు
గుడిగొన నొసలఁ గుంకేమతిలకమువెట్టె
యెడయక సూర్యచంద్రు లేకత మాడినట్టు
(॥॥)
నెమ్మదిఁ జన్నులమీఁద నీలహారముల్ వేనె
తుమ్మిదలు జక్కవలు దొరలినట్టు
వుమ్మడి నడుమఁ బైఁడి వొడ్డాణము గట్టుకొనె
నెమ్మది మెరుపు మిన్ను నేస్తము నేసినట్టు
(॥॥)
అంచితపుఁ జేకట్లు హస్తముల ధరియించె
యెంచఁ జిగుళ్లుఁ దాముర లెనసినట్టు
పొంచి శ్రీ వేంకటేశుతోఁ బొసఁగె సమరతులఁ
నంచల బొమ్మ పెండ్లి యమరినయట్టు
(||pallavi||)
sĕppa narudāyam̐gadĕ sĕlisiṁgāramu nem̐ḍu
nŏppagu marubaṁḍāra mŏnagūrsinaṭlu
(||||)
tŏḍim̐baḍa semaṁtulu durimĕm̐ gŏppunam̐jĕli
kaḍum̐jīm̐kaḍī vĕnnĕlām̐ galasinaṭlu
guḍigŏna nŏsalam̐ guṁkemadilagamuvĕṭṭĕ
yĕḍayaga sūryasaṁdru legada māḍinaṭṭu
(||||)
nĕmmadim̐ jannulamīm̐da nīlahāramul venĕ
tummidalu jakkavalu dŏralinaṭṭu
vummaḍi naḍumam̐ baim̐ḍi vŏḍḍāṇamu gaṭṭugŏnĕ
nĕmmadi mĕrubu minnu nestamu nesinaṭṭu
(||||)
aṁchidabum̐ jegaṭlu hastamula dhariyiṁchĕ
yĕṁcham̐ jiguḽlum̐ dāmura lĕnasinaṭṭu
pŏṁchi śhrī veṁkaḍeśhudom̐ bŏsam̐gĕ samaradulam̐
naṁchala bŏmma pĕṁḍli yamarinayaṭṭu