చెనకేవు వూరకైనాఁ జెరఁగువట్టి తీసేవు
(॥పల్లవి॥)
చెనకేవు వూరకైనాఁ జెరఁగువట్టి తీసేవు
మనసిచ్చి మమ్మెందులో మన్నించేవయ్యా
(॥చెన॥)
చనవుగలవారికి సారె మందెమేళము
ననుపుగలవారికి నవ్వులువచ్చు
యెనసినవారికి ఇయ్యకోలైవుండు
ఆనిశము మమ్మెందులో నాదరించేవయ్యా
(॥చెన॥)
మేనవారైనవారికి మించు నట్టె వుద్ధండము
నానినయింటివారికి నమ్మిక గల్గు
పూని కొలువువారికి పొద్దులు దనిసివుండు
కానీలే మమ్మెందుగోఁ గైకొనేవయ్యా
(॥చెన॥)
వొట్టి పెండ్లాడినవారి కొకమనసైవుండు
నెట్టుకొన్న వారికి నెలవై వుండు
గుట్టున శ్రీవేంకటేశ కూడితిని నన్ను నేఁడు
యిట్టె మమ్మెవ్వరిలోన నేలేవయ్యా
(||pallavi||)
sĕnagevu vūragainām̐ jĕram̐guvaṭṭi tīsevu
manasichchi mammĕṁdulo manniṁchevayyā
(||sĕna||)
sanavugalavārigi sārĕ maṁdĕmeḽamu
nanubugalavārigi navvuluvachchu
yĕnasinavārigi iyyagolaivuṁḍu
āniśhamu mammĕṁdulo nādariṁchevayyā
(||sĕna||)
menavārainavārigi miṁchu naṭṭĕ vuddhaṁḍamu
nāninayiṁṭivārigi nammiga galgu
pūni kŏluvuvārigi pŏddulu danisivuṁḍu
kānīle mammĕṁdugom̐ gaigŏnevayyā
(||sĕna||)
vŏṭṭi pĕṁḍlāḍinavāri kŏgamanasaivuṁḍu
nĕṭṭugŏnna vārigi nĕlavai vuṁḍu
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍidini nannu nem̐ḍu
yiṭṭĕ mammĕvvarilona nelevayyā