చెలులాల యాతనికిఁ జెప్పరే మీరు
(॥పల్లవి॥)
చెలులాల యాతనికిఁ జెప్పరే మీరు
యెలమి నెదిరివారి యింగిత మెరఁగఁడా
(॥చెలు॥)
ప్రియము చెప్పెడిమాట పెదవిపై నుండఁగాను
క్రియ యెరఁగకేల వేగిరించీఁ దాను
నయములు వినయాలు నావొళ్ల నుండఁగాను
దయ యెఱఁగక యేల తమకించీనే
(॥చెలు॥)
కడుఁ జల్లని చూపులు కన్నులనే వుండఁగాను
పొడిఁబడి తనకింత పొక్కనేఁటికే
చిడుముడి నవ్వులు నా సెలవులనుండఁగాను
గొడవలు తనకేలే కొసరీఁ దా నిపుడు
(॥చెలు॥)
పూఁచినట్టి కాఁగిలి బుజముల నుండగాను
లోఁచి చూడఁ దనకేలే లోలో నన్ను
యేఁచక శ్రీ వేంకటేశు నిట్టె తన్ను నేఁగూడితి
పాఁచిరతులిఁక నేలే పై పై నా యెడకు
(||pallavi||)
sĕlulāla yādanigim̐ jĕppare mīru
yĕlami nĕdirivāri yiṁgida mĕram̐gam̐ḍā
(||sĕlu||)
priyamu sĕppĕḍimāḍa pĕdavibai nuṁḍam̐gānu
kriya yĕram̐gagela vegiriṁchīm̐ dānu
nayamulu vinayālu nāvŏḽla nuṁḍam̐gānu
daya yĕṟam̐gaga yela tamagiṁchīne
(||sĕlu||)
kaḍum̐ jallani sūbulu kannulane vuṁḍam̐gānu
pŏḍim̐baḍi tanagiṁta pŏkkanem̐ṭige
siḍumuḍi navvulu nā sĕlavulanuṁḍam̐gānu
gŏḍavalu tanagele kŏsarīm̐ dā nibuḍu
(||sĕlu||)
pūm̐sinaṭṭi kām̐gili bujamula nuṁḍagānu
lom̐si sūḍam̐ danagele lolo nannu
yem̐saga śhrī veṁkaḍeśhu niṭṭĕ tannu nem̐gūḍidi
pām̐siradulim̐ka nele pai pai nā yĕḍagu