చెల్లఁబో నన్ను నీవింత సేతురటవే
(॥పల్లవి॥)
చెల్లఁబో నన్ను నీవింత సేతురటవే
వెల్లవిరిగా నేమైనా వింటివటవే
(॥చెల్ల॥)
వెన్నెలలే మరిగేవు వెంటవెంటఁ దిరిగేవు
నన్ను నీవు మతి నంత నమ్మవటే
వెన్న నున్నఁగా నూరేవు వెక్కసమై దూరేవు
కన్నెరో నీవేమైనాఁ గంటివటవే
(॥చెల్ల॥)
కుంకుమలే కురిసేవు కొంగువట్టి జరసేవు
ఇంకా నాగుణము నీ వెఱఁగవటే
లంకెనుండి జునిఁగేవు లావులకే పెనఁగేవు
కంకిగా నెందుకైనా నేఁ గాదనేనటే
(॥చెల్ల॥)
పన్నీరే చిలికేవు పట్టి తేనె యలికేవు
అన్నువనాకాఁగి లింత యలపటవే
వున్నతి శ్రీవేంకటాద్రి నుండి వచ్చి నంబటూరి-
చెన్నుఁడనై కూడితిని చేకొంటివటే
(||pallavi||)
sĕllam̐bo nannu nīviṁta seduraḍave
vĕllavirigā nemainā viṁṭivaḍave
(||sĕlla||)
vĕnnĕlale marigevu vĕṁṭavĕṁṭam̐ dirigevu
nannu nīvu madi naṁta nammavaḍe
vĕnna nunnam̐gā nūrevu vĕkkasamai dūrevu
kannĕro nīvemainām̐ gaṁṭivaḍave
(||sĕlla||)
kuṁkumale kurisevu kŏṁguvaṭṭi jarasevu
iṁkā nāguṇamu nī vĕṟam̐gavaḍe
laṁkĕnuṁḍi junim̐gevu lāvulage pĕnam̐gevu
kaṁkigā nĕṁdugainā nem̐ gādanenaḍe
(||sĕlla||)
pannīre siligevu paṭṭi tenĕ yaligevu
annuvanāgām̐gi liṁta yalabaḍave
vunnadi śhrīveṁkaḍādri nuṁḍi vachchi naṁbaḍūri-
sĕnnum̐ḍanai kūḍidini segŏṁṭivaḍe