సతులకుఁ బతులకు సాజమె యిది
(॥పల్లవి॥)
సతులకుఁ బతులకు సాజమె యిది
యితవు లెంచుక తామే యేకములు నవుదురు
(॥సతులకు॥)
కూరిమి గలుగుసతి కోరి పతిఁ గాన కున్న
యేరీతి నయిన దూరు యిందరితోడ
దార దప్పి మగవాఁడు తనయిచ్చఁ దిరిగాడి
యీరసాన నే మనిన యెగ్గులునుఁ బట్టఁడు
(॥సతులకు॥)
అంకెకు రా కున్నవేళ నాఁడువారు మగవానిఁ
గంకి నేసి కన్నచోటఁ గాకు సేతురు
వంక లొత్తఁ బోఁడు తనవల్ల నేరుమి గలితే
మంకు దీరి తనుఁ దానె మట్టుకు వచ్చును
(॥సతులకు॥)
కాఁగినచెలియ తనకాఁగిటికి దగ్గరితే
లోఁగి తనవిభునికి లో నవును
వీఁగుచు శ్రీవెంకటేశ వెలఁదిఁ గూడితి విట్టె
చేఁగ దేర నే మిందుకు నెలవి నవ్వుదుమూ
(||pallavi||)
sadulagum̐ badulagu sājamĕ yidi
yidavu lĕṁchuga tāme yegamulu navuduru
(||sadulagu||)
kūrimi galugusadi kori padim̐ gāna kunna
yerīdi nayina dūru yiṁdaridoḍa
dāra dappi magavām̐ḍu tanayichcham̐ dirigāḍi
yīrasāna ne manina yĕggulunum̐ baṭṭam̐ḍu
(||sadulagu||)
aṁkĕgu rā kunnaveḽa nām̐ḍuvāru magavānim̐
gaṁki nesi kannasoḍam̐ gāgu seduru
vaṁka lŏttam̐ bom̐ḍu tanavalla nerumi galide
maṁku dīri tanum̐ dānĕ maṭṭugu vachchunu
(||sadulagu||)
kām̐ginasĕliya tanagām̐giḍigi daggaride
lom̐gi tanavibhunigi lo navunu
vīm̐gusu śhrīvĕṁkaḍeśha vĕlam̐dim̐ gūḍidi viṭṭĕ
sem̐ga dera ne miṁdugu nĕlavi navvudumū