చద్దికి వేఁడివలపు సరికి బేసి
(॥పల్లవి॥)
చద్దికి వేఁడివలపు సరికి బేసి
ఇద్దరూను యిద్దరమే యేల యింత గర్వము
(॥చద్ది॥)
సలిగెలఁ బొరలే నీసరితలు చూచేఁగాక
నెలఁతరో నీయంత నేరనా నేను
ఎలమితో రమణుఁడు యిద్దరినడిమితాసు
యిలపై యెందు వీఁగునో యేలయింత గర్వము
(॥చద్ది॥)
ఆసోదపు నీలోని అనువు దెలిసేఁగాక
వోసతిరో నీపాటి వోపనా నేను
పూసలలో దారమీపురుషుఁడు నీకు నాకు
యేసూటివచ్చునో నీకు యేలయింత గర్వము
(॥చద్ది॥)
కూడిన కొత్తరికపు గుణము చూచేఁగాక
చేడెరో నీ పాటి పొందు చెల్లదా నాకు
యీడనే శ్రీ వెంకటేశుఁడెనసె నిన్నును నన్ను
యేడకేడ మాఁటలాడేవేల యింత గర్వము
(||pallavi||)
saddigi vem̐ḍivalabu sarigi besi
iddarūnu yiddarame yela yiṁta garvamu
(||saddi||)
saligĕlam̐ bŏrale nīsaridalu sūsem̐gāga
nĕlam̐taro nīyaṁta neranā nenu
ĕlamido ramaṇum̐ḍu yiddarinaḍimidāsu
yilabai yĕṁdu vīm̐guno yelayiṁta garvamu
(||saddi||)
āsodabu nīloni anuvu dĕlisem̐gāga
vosadiro nībāḍi vobanā nenu
pūsalalo dāramīburuṣhum̐ḍu nīgu nāgu
yesūḍivachchuno nīgu yelayiṁta garvamu
(||saddi||)
kūḍina kŏttarigabu guṇamu sūsem̐gāga
seḍĕro nī pāḍi pŏṁdu sĕlladā nāgu
yīḍane śhrī vĕṁkaḍeśhum̐ḍĕnasĕ ninnunu nannu
yeḍageḍa mām̐ṭalāḍevela yiṁta garvamu