(॥పల్లవి॥)
పోయిన పనులకేల పోనీవయ్యా
చాయ సేసుకొంటినా సమ్మతైతిఁ గాక
(॥॥)
వలవవద్దంటినా వడి నీ వెవ్వరికైనా
అల మాయింటికి రాకుమంటిఁ గాక
పిలువవద్దంటినా పేరుకొ నెవ్వతెనైనా
వలవనిమాట మాతో వద్దంటిఁగాక
(॥॥)
చూడఁగవద్దంటినా సుదతులవంక నిన్ను
ఆడా నీడా మమ్మంటకు మంటిఁ గాక
వేడుకకాఁడవై నీవు వీది నుండవద్దంటినా
యేడలేనిప్రియాలు నా కేటికంటిఁగాక
(॥॥)
నగఁగా వద్దంటినా ననుపుసతులతోడ
యిగురుమో వడుగకు మిట్టంటిఁగాక
అగపడి శ్రీ వేంకటాధిప కూడితి నిన్ను
మొగమోడకుండితినా మొక్కనైతిఁ గాక
(||pallavi||)
poyina panulagela ponīvayyā
sāya sesugŏṁṭinā sammadaidim̐ gāga
(||||)
valavavaddaṁṭinā vaḍi nī vĕvvarigainā
ala māyiṁṭigi rāgumaṁṭim̐ gāga
piluvavaddaṁṭinā perugŏ nĕvvadĕnainā
valavanimāḍa mādo vaddaṁṭim̐gāga
(||||)
sūḍam̐gavaddaṁṭinā sudadulavaṁka ninnu
āḍā nīḍā mammaṁṭagu maṁṭim̐ gāga
veḍugagām̐ḍavai nīvu vīdi nuṁḍavaddaṁṭinā
yeḍalenipriyālu nā keḍigaṁṭim̐gāga
(||||)
nagam̐gā vaddaṁṭinā nanubusaduladoḍa
yigurumo vaḍugagu miṭṭaṁṭim̐gāga
agabaḍi śhrī veṁkaḍādhiba kūḍidi ninnu
mŏgamoḍaguṁḍidinā mŏkkanaidim̐ gāga