పొద్దువోని జవరాలు బొమ్మలఁ గాటుక వెట్టీ
(॥పల్లవి॥)
పొద్దువోని జవరాలు బొమ్మలఁ గాటుక వెట్టీ
గద్దరి సవతులెల్లాఁ గాచుకుండఁగాను
(॥పొద్దు॥)
సంతవెట్టుక మగని సంగడిఁ గూచుండి యీకె
యెంతదడవైనా మొగ మేమిచూచీనే
చింతకాయకజ్జాయాలు చెప్పరానివలపులు
అంతటా నోరూరించే దది తా నెఱఁగదా
(॥పొద్దు॥)
పలుమారు రమణుని పక్కఁ బండి తనియక
మలయుచు నెందాఁకా మాటలాడీనే
యెలమి యిసుకపాఁత రెంతదవ్వినా మనసు
అలవిలేకపై కొనే దది తానెఱఁగదా
(॥పొద్దు॥)
యేపున శ్రీవేంకటేశుఁ డీలమేల్‌మంగపతి
యేపొద్దూఁ గాఁగిలించి తా నేమినవ్వీనే
పూపలై వసంతకాలపుఁ జిగురులు రతులు
ఆపొద్దే నన్నేలె నాతఁ డదిదా నెఱఁగదా
(||pallavi||)
pŏdduvoni javarālu bŏmmalam̐ gāḍuga vĕṭṭī
gaddari savadulĕllām̐ gāsuguṁḍam̐gānu
(||pŏddu||)
saṁtavĕṭṭuga magani saṁgaḍim̐ gūsuṁḍi yīgĕ
yĕṁtadaḍavainā mŏga memisūsīne
siṁtagāyagajjāyālu sĕpparānivalabulu
aṁtaḍā norūriṁche dadi tā nĕṟam̐gadā
(||pŏddu||)
palumāru ramaṇuni pakkam̐ baṁḍi taniyaga
malayusu nĕṁdām̐kā māḍalāḍīne
yĕlami yisugabām̐ta rĕṁtadavvinā manasu
alavilegabai kŏne dadi tānĕṟam̐gadā
(||pŏddu||)
yebuna śhrīveṁkaḍeśhum̐ ḍīlamelmaṁgabadi
yebŏddūm̐ gām̐giliṁchi tā neminavvīne
pūbalai vasaṁtagālabum̐ jigurulu radulu
ābŏdde nannelĕ nādam̐ ḍadidā nĕṟam̐gadā