పిసికితే పసురౌను ప్రియములెల్లా
(॥పల్లవి॥)
పిసికితే పసురౌను ప్రియములెల్లా
పొసఁగినవాటినే పొందవలెఁ గాని
(॥పిసి॥)
సలిగెగద్దంటాను సారె నెత్తికెక్కరాదు
పిలిచేవంటా నీతోబిగియరాదు
కలసేనంటా మేను కడుఁబిప్పి సేయరాదు
వొలిసి మట్టుకుమట్టే వుండవలెఁగాని
(॥పిసి॥)
యిందు రమ్మనేవంటా యిల్లెల్లాఁ జేకొనరాదు
మందెమేళమాయనంటా మారుకోరాదు
యెందైనా వచ్చేవంటా యిలయెల్లాఁ దిప్పరాదు
అంది సరవి మనసియ్యవలెఁగాని
(॥పిసి॥)
చెప్పినట్లు సేసేవంటా సేవలు గొనఁగరాదు
వొప్పుగఁ గూడితివంటా వుబ్బఁగరాదు
యిప్పుడే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు
మెప్పించి సమరతుల మెచ్చవలెఁగాని
(||pallavi||)
pisigide pasuraunu priyamulĕllā
pŏsam̐ginavāḍine pŏṁdavalĕm̐ gāni
(||pisi||)
saligĕgaddaṁṭānu sārĕ nĕttigĕkkarādu
pilisevaṁṭā nīdobigiyarādu
kalasenaṁṭā menu kaḍum̐bippi seyarādu
vŏlisi maṭṭugumaṭṭe vuṁḍavalĕm̐gāni
(||pisi||)
yiṁdu rammanevaṁṭā yillĕllām̐ jegŏnarādu
maṁdĕmeḽamāyanaṁṭā mārugorādu
yĕṁdainā vachchevaṁṭā yilayĕllām̐ dipparādu
aṁdi saravi manasiyyavalĕm̐gāni
(||pisi||)
sĕppinaṭlu sesevaṁṭā sevalu gŏnam̐garādu
vŏppugam̐ gūḍidivaṁṭā vubbam̐garādu
yippuḍe śhrīveṁkaḍeśha yelidivi nannu nīvu
mĕppiṁchi samaradula mĕchchavalĕm̐gāni