పిలువవచ్చిన నేను పెం(పీఁ?)ట వెట్టుకొన్నదాన
(॥పల్లవి॥)
పిలువవచ్చిన నేను పెం(పీఁ?)ట వెట్టుకొన్నదాన
తలఁపు నీ కెట్టున్నదో దంటఁగాను నేను
(॥పలు॥)
కామినులతోడి మాట కలది కలట్టేకాని
కోమలపు కల్లలైతె కోపగింతురు
జామాయ నీవద్దనుండి సరినాపెతో నేమందు
నీమతకము లేఁటివో నే మెరఁగ మిఁకను
(॥పలు॥)
వలచినవారిపొందు వచ్చినట్టె వచ్చుఁగాని
కొలఁదికి రాకున్న కొసరుదురు
నెలకొంటి నిక్కడ నేనె నాపె నెట్టు నమ్మింతు
యెలమి మీ కిద్దరికి నెదురాడ నోపను
(॥పలు॥)
యిల్లాండ్ల కన్నియును యియ్యకోలై వుండుఁగాని
జల్లించి సందుగలితే సాధించరు
యిల్లిదె నన్నుఁ గూడి యింట నాపెఁ గూడితివి
వొల్లనె శ్రీవెంకటేశ వూరకుండే నిపుడు
(||pallavi||)
piluvavachchina nenu pĕṁ(pīm̐?)ṭa vĕṭṭugŏnnadāna
talam̐pu nī kĕṭṭunnado daṁṭam̐gānu nenu
(||palu||)
kāminuladoḍi māḍa kaladi kalaṭṭegāni
komalabu kallalaidĕ kobagiṁturu
jāmāya nīvaddanuṁḍi sarinābĕdo nemaṁdu
nīmadagamu lem̐ṭivo ne mĕram̐ga mim̐kanu
(||palu||)
valasinavāribŏṁdu vachchinaṭṭĕ vachchum̐gāni
kŏlam̐digi rāgunna kŏsaruduru
nĕlagŏṁṭi nikkaḍa nenĕ nābĕ nĕṭṭu nammiṁtu
yĕlami mī kiddarigi nĕdurāḍa nobanu
(||palu||)
yillāṁḍla kanniyunu yiyyagolai vuṁḍum̐gāni
jalliṁchi saṁdugalide sādhiṁcharu
yillidĕ nannum̐ gūḍi yiṁṭa nābĕm̐ gūḍidivi
vŏllanĕ śhrīvĕṁkaḍeśha vūraguṁḍe nibuḍu