Padi meemda nimta yela pamtamulu nerabevu

పతి మీఁద నింత యేల పంతములు నెరపేవు
Language

(॥పల్లవి॥)
పతి మీఁద నింత యేల పంతములు నెరపేవు
యితవుగా నెప్పుడును ఇచ్చకమే మేలు

(॥॥)
మొక్కలాన బొమ్మలు ముడివెట్టుకోకువే
చక్కని నీ మోమునకు సాజమే మేలు
వెక్కసానఁ బెదవులు విరిచి మాటాడకువే
చెక్కులదాఁ కాఁ బారే చిఱునవ్వే మేలు

(॥॥)
మంచి నీ కరములను మఱుఁగు వెట్టుకోకువే
చుంచుల నీ మెయికళలు చూపేదే మేలు
అంచెల నీ గుబ్బలఁ బయ్యద బిగించుకోకువే
వంచన సేయక వెలయించేదే మేలు

(॥॥)
మొల్లల తోడి తురుము ముసుఁగులో దాఁచకువే
మెల్లనే సింగారాల మించుటే మేలు
ఇల్లిదె శ్రీ వేంకటేశుఁ డింతలోనే నిన్నుఁగూడె
వెల్లివిరై వలపులు చల్లేదే మేలు

(||pallavi||)
padi mīm̐da niṁta yela paṁtamulu nĕrabevu
yidavugā nĕppuḍunu ichchagame melu

(||||)
mŏkkalāna bŏmmalu muḍivĕṭṭugoguve
sakkani nī momunagu sājame melu
vĕkkasānam̐ bĕdavulu virisi māḍāḍaguve
sĕkkuladām̐ kām̐ bāre siṟunavve melu

(||||)
maṁchi nī karamulanu maṟum̐gu vĕṭṭugoguve
suṁchula nī mĕyigaḽalu sūbede melu
aṁchĕla nī gubbalam̐ bayyada bigiṁchugoguve
vaṁchana seyaga vĕlayiṁchede melu

(||||)
mŏllala toḍi turumu musum̐gulo dām̐saguve
mĕllane siṁgārāla miṁchuḍe melu
illidĕ śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalone ninnum̐gūḍĕ
vĕllivirai valabulu sallede melu