పాయపువాఁడు దానే పసిబాలుఁడు దానే
(॥పల్లవి॥)
పాయపువాఁడు దానే పసిబాలుఁడు దానే
చాయల సన్నలచేత చనవిచ్చీ నిపుడు
(॥॥)
వేడుకకాఁడై యిదివో విఠలుఁడు వీధులను
వాడికవలపు చల్లి వనితలపై
కోడెల నావులఁ గాచే గొల్లెతల యిండ్లను
వోడక వెన్నలఁ బాల నోలలాడీ నిపుడు
(॥॥)
సంగడి తేరులమీఁద సత్యభామ రుక్మిణుల
చెంగట సేసలు వెట్టే శ్రీకృష్ణుఁడు
ముంగిటి వ్రేపల్లెలోన ముద్దులు గురియుచును
సింగారపుటుట్లకు చేయి చాఁచీ నిపుడు
(॥॥)
అందపుమేడలెక్కి అష్టమహిషులతోడ
విందుల మోవియిచ్చి శ్రీవేంకటేశుఁడు
యెందునుఁ దుంగభద్రయేటిదరిఁ గూడి యాడి
సందడి రతులచేత సమకూడీ నిపుడు
(||pallavi||)
pāyabuvām̐ḍu dāne pasibālum̐ḍu dāne
sāyala sannalaseda sanavichchī nibuḍu
(||||)
veḍugagām̐ḍai yidivo viṭhalum̐ḍu vīdhulanu
vāḍigavalabu salli vanidalabai
koḍĕla nāvulam̐ gāse gŏllĕdala yiṁḍlanu
voḍaga vĕnnalam̐ bāla nolalāḍī nibuḍu
(||||)
saṁgaḍi terulamīm̐da satyabhāma rukmiṇula
sĕṁgaḍa sesalu vĕṭṭe śhrīkṛṣhṇum̐ḍu
muṁgiḍi vreballĕlona muddulu guriyusunu
siṁgārabuḍuṭlagu seyi sām̐sī nibuḍu
(||||)
aṁdabumeḍalĕkki aṣhṭamahiṣhuladoḍa
viṁdula moviyichchi śhrīveṁkaḍeśhum̐ḍu
yĕṁdunum̐ duṁgabhadrayeḍidarim̐ gūḍi yāḍi
saṁdaḍi radulaseda samagūḍī nibuḍu