ఊరకే దొరుకునా వున్నతోన్నతసుఖము
(॥పల్లవి॥)
ఊరకే దొరుకునా వున్నతోన్నతసుఖము
సారంబు దెలిసి కా జయము చేకొనుట
(॥ఊర॥)
తలఁపులోపలి చింత దాఁటినప్పుడు గదా
అలరి దైవంబు ప్రత్యక్షమౌట
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా
తలకొన్న మోక్షంబు తనకుఁ జేపడుట
(॥ఊర॥)
కర్మంబు కసటు వోఁ గడగినప్పుడు గదా
నిర్మలజ్ఞానంబు నెరవేరుట
మర్మంబు శ్రీహరి నీమఱఁగు జొచ్చినఁ గదా
కూర్మిఁ దన జన్మమెక్కుడు కెక్కుడౌట
(॥ఊర॥)
తన శాంతమాత్మలోఁ దగిలినప్పుడు గదా
పనిగొన్న తన చదువు ఫలియించుట
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బినఁ గదా దరిచేరి మనుట
(||pallavi||)
ūrage dŏrugunā vunnadonnadasukhamu
sāraṁbu dĕlisi kā jayamu segŏnuḍa
(||ūra||)
talam̐pulobali siṁta dām̐ṭinappuḍu gadā
alari daivaṁbu pratyakṣhamauḍa
kaluṣhaṁpu durmadamu gaḍasinappuḍu gadā
talagŏnna mokṣhaṁbu tanagum̐ jebaḍuḍa
(||ūra||)
karmaṁbu kasaḍu vom̐ gaḍaginappuḍu gadā
nirmalajñānaṁbu nĕraveruḍa
marmaṁbu śhrīhari nīmaṟam̐gu jŏchchinam̐ gadā
kūrmim̐ dana janmamĕkkuḍu kĕkkuḍauḍa
(||ūra||)
tana śhāṁtamātmalom̐ dagilinappuḍu gadā
panigŏnna tana saduvu phaliyiṁchuḍa
yĕnaleni śhrīveṁkaḍeśhvaruni dāsyaṁbu
tanagu nabbinam̐ gadā dariseri manuḍa