(॥పల్లవి॥)
ఒడలి తాపముమీఁద నుసురనీని
కడలేని చిచ్చుమీఁద గాలి చల్లీఁ దరుణి
(॥ఒడలి॥)
జల్లనం గొప్పు విరులు జారఁ దోచి జవరాలు
మెల్లనే తుమ్మిదలకు మేఁత వెట్టీని
చెల్లఁబో మీఁ దెఱుంగదు జెప్పరమ్మ పెనుఁబాము
పిల్లలకుఁ బాలువోసి పెంచఁజూచీఁ దరుణి
(॥ఒడలి॥)
గొప్పవైన గుబ్బలపైఁ గుంకుమ కస్తూరి పూఁత
లప్పలు గాలికిఁ దెచ్చి లంచ మిచ్చీని
ఒప్పదు మానుపరమ్మా ఉప్పతిలఁ బలుమారు
నిప్పుల మీదటఁ దెచ్చి నేయి చల్లీఁ దరుణి
(॥ఒడలి॥)
చెనకించి యధరంపుఁ జిగురాకు కెంపుల
నొనరుఁ గోవిల నోరూరించీని
చనవున వేంకటస్వామి కౌఁగిటఁ గూడి
కినిసి పాసెములూఁ జక్కెర వెట్టెఁ దరుణి
(||pallavi||)
ŏḍali tābamumīm̐da nusuranīni
kaḍaleni sichchumīm̐da gāli sallīm̐ daruṇi
(||ŏḍali||)
jallanaṁ gŏppu virulu jāram̐ dosi javarālu
mĕllane tummidalagu mem̐ta vĕṭṭīni
sĕllam̐bo mīm̐ dĕṟuṁgadu jĕpparamma pĕnum̐bāmu
pillalagum̐ bāluvosi pĕṁcham̐jūsīm̐ daruṇi
(||ŏḍali||)
gŏppavaina gubbalabaim̐ guṁkuma kastūri pūm̐ta
lappalu gāligim̐ dĕchchi laṁcha michchīni
ŏppadu mānubarammā uppadilam̐ balumāru
nippula mīdaḍam̐ dĕchchi neyi sallīm̐ daruṇi
(||ŏḍali||)
sĕnagiṁchi yadharaṁpum̐ jigurāgu kĕṁpula
nŏnarum̐ govila norūriṁchīni
sanavuna veṁkaḍasvāmi kaum̐giḍam̐ gūḍi
kinisi pāsĕmulūm̐ jakkĕra vĕṭṭĕm̐ daruṇi