Obinadaanam gaanu voorage suddula kellaa

ఓపినదానఁ గాను వూరకే సుద్దుల కెల్లా
Language

(॥పల్లవి॥)
ఓపినదానఁ గాను వూరకే సుద్దుల కెల్లా
నీపాదము సేవ సేసి నిలుచుంట చాలదా

(॥ఓపి॥)
మొక్కుచు నీకొకమాఁట మొన్న నే విన్నవించనా
పక్కన నన్నేల వొడఁబరచేవంత
చిక్కినవారిపై నేల చేఁతలెల్లాఁ జేసేవు
వొక్కటై నీవారమని వుండుటిది చాలదా

(॥ఓపి॥)
వేమారు నే నిన్ను వేఁడుకొననా ఇందాఁక
నామువార నాతోనేల నవ్వేవంత
దీమసములేనివారిఁ దెగి యేలపరచేవు
ప్రేమతోడ నీతోఁ గొంత పెనఁగుట చాలదా

(॥ఓపి॥)
కందువ లంటుచు నిన్నుఁ గాఁగిలించుకొననా
అందరిలో నన్నుఁ మెచ్చే వప్పటి నీవు
విందువెట్టి యిట్టె శ్రీవేంకటేశ కూడితివి
పందెమాడి నీమాటలో పరగుట చాలదా

(||pallavi||)
obinadānam̐ gānu vūrage suddula kĕllā
nībādamu seva sesi nilusuṁṭa sāladā

(||obi||)
mŏkkusu nīgŏgamām̐ṭa mŏnna ne vinnaviṁchanā
pakkana nannela vŏḍam̐barasevaṁta
sikkinavāribai nela sem̐talĕllām̐ jesevu
vŏkkaḍai nīvāramani vuṁḍuḍidi sāladā

(||obi||)
vemāru ne ninnu vem̐ḍugŏnanā iṁdām̐ka
nāmuvāra nādonela navvevaṁta
dīmasamulenivārim̐ dĕgi yelabarasevu
premadoḍa nīdom̐ gŏṁta pĕnam̐guḍa sāladā

(||obi||)
kaṁduva laṁṭusu ninnum̐ gām̐giliṁchugŏnanā
aṁdarilo nannum̐ mĕchche vappaḍi nīvu
viṁduvĕṭṭi yiṭṭĕ śhrīveṁkaḍeśha kūḍidivi
paṁdĕmāḍi nīmāḍalo paraguḍa sāladā