నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
(॥పల్లవి॥)
నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడు
(॥నిత్యా॥)
ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ
డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁగాఁడు
యేమూర్తి త్రైమూర్తి లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాత్ముఁడేమూర్తి పరమాత్ముఁ-
డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు
(॥నిత్యా॥)
యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నే దేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁడిజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుఁ-
డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు
(॥నిత్యా॥)
యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పు నిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ-
డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు
(||pallavi||)
nityātmuḍai yuṁḍi nityuḍai vĕlugŏṁdu
satyātmuḍai yuṁḍi satyamai tānuṁḍu
pratyakṣhamai yuṁḍi brahmamai yuṁḍu saṁ-
stutyum̐ḍī tiruveṁkaḍādrivibhum̐ḍu
(||nityā||)
e mūrdi logaṁbulĕlla nelĕḍunādam̐-
ḍemūrdi brahmādulĕlla vĕdagĕḍunādam̐-
ḍemūrdi nijamokṣhamiyyam̐ jālĕḍunādam̐
ḍemūrdi logaigahidum̐ḍu
yemūrdi nijamūrdi yemūrdiyunum̐gām̐ḍu
yemūrdi traimūrdi legamainayādam̐-
ḍemūrdi sarvātmum̐ḍemūrdi paramātmum̐-
ḍāmūrdi tiruveṁkaḍādrivibhum̐ḍu
(||nityā||)
yedevudehamuna ninniyunu janmiṁchĕ
ne devudehamuna ninniyunu naṇam̐gĕ mari
yedevuvigrahaṁ bīsagala miṁtayunu
yedevunetraṁbu linasaṁdrulu
yedevum̐ḍijīvulinniṁṭilo nuṁḍu
nedevusaidanya minniḍigi nādhāra-
medevum̐ ḍavyaktum̐ ḍedevum̐ ḍadvaṁdvum̐-
ḍādevum̐ ḍīveṁkaḍādrivibhum̐ḍu
(||nityā||)
yevelbubādayuga milayunāgāśhaṁbu
yevelbubādageśhāṁtaṁ banaṁtaṁbu
yevelbu niśhvāsa mīmahāmārudamu
yevelbunijadāsu lībuṇyulu
yevelbu sarveśhum̐ ḍevelbu parameśhum̐-
ḍevelbu bhuvanaigahidamanobhāvagum̐ḍu
yevelbu kaḍusūkṣhma mevelbu kaḍughanamu
āvelbu tiruveṁkaḍādrivibhum̐ḍu