నేరము లెంచకుమయ్య నీ విన్నిటా ఘనుఁడవు
(॥పల్లవి॥)
నేరము లెంచకుమయ్య నీ విన్నిటా ఘనుఁడవు
తారుకాణగా నిఁక దయసేయవయ్యా
(॥నేర॥)
చెలిని మన్నించుమని సేసితి విన్నపాలెల్లా
పలుమారు మొక్కితి నీ పాదములకు
వెలయఁగఁ జెక్కునొక్కి వేఁడుకొంటిఁ జనవున
తలఁచి చిత్తానఁబెట్టి దయసేయవయ్యా
(॥నేర॥)
పెక్కులాగులను నీకుఁ బ్రియము లిదె చెప్పితి
ఇక్కడ నీచే నమ్మిక లిప్పించుకొంటి
అక్కరతో నీమీఁది ఆసలెల్లా దెలిపితి
తక్కక చిత్తానఁ బెట్టి దయసేయవయ్యా
(॥నేర॥)
చెప్పరాని వినయాలసేవల కొడిగట్టితి
ముప్పిరి నీపై పదముల వాడితి
ఇప్పు డిట్టె శ్రీవేంకటేశ యీకె నేలితివి
తప్పక చిత్తానఁబెట్టి దయసేయవయ్యా
(||pallavi||)
neramu lĕṁchagumayya nī vinniḍā ghanum̐ḍavu
tārugāṇagā nim̐ka dayaseyavayyā
(||nera||)
sĕlini manniṁchumani sesidi vinnabālĕllā
palumāru mŏkkidi nī pādamulagu
vĕlayam̐gam̐ jĕkkunŏkki vem̐ḍugŏṁṭim̐ janavuna
talam̐si sittānam̐bĕṭṭi dayaseyavayyā
(||nera||)
pĕkkulāgulanu nīgum̐ briyamu lidĕ sĕppidi
ikkaḍa nīse nammiga lippiṁchugŏṁṭi
akkarado nīmīm̐di āsalĕllā dĕlibidi
takkaga sittānam̐ bĕṭṭi dayaseyavayyā
(||nera||)
sĕpparāni vinayālasevala kŏḍigaṭṭidi
muppiri nībai padamula vāḍidi
ippu ḍiṭṭĕ śhrīveṁkaḍeśha yīgĕ nelidivi
tappaga sittānam̐bĕṭṭi dayaseyavayyā