నీయంతవాఁడనా నేను నేరము లే మెంచేవు
(॥పల్లవి॥)
నీయంతవాఁడనా నేను నేరము లే మెంచేవు
యీయెడ నిరుహేతుకకృపఁ జూడు నన్నును
(॥నీయంత॥)
నిరతి నిన్నెఱుఁగను నీవు నన్నెఱుఁగుదువు
ధర యాచకుఁడ నేను దాతవు నీవు
వరుస నీచుఁడ నేను వైకుంఠపతివి నీన
నరుఁడ నేను నీవు నారాయణుఁడవు
(॥నీయంత॥)
సారె నలసుఁడ నేను సర్వశక్తివి నీవు
ధీరుఁడవు నీవతి దీనుఁడ నేను
కారుణ్యమూర్తివి నీవు కఠినచిత్తుఁడ నేను
మేరతో నీ వేలికవు మీ దాసుఁడ నేను
(॥నీయంత॥)
జననశీలుఁడ నేను జనకుఁడవు నీవు
ఘనవేదాంతనిధివి కర్మిని నేను
అనిశము శ్రీవేంకటాచలేంద్రుఁడవు నీవు
పనుల నీ సంకీర్తనపరుఁడ నేను
(||pallavi||)
nīyaṁtavām̐ḍanā nenu neramu le mĕṁchevu
yīyĕḍa niruhedugakṛpam̐ jūḍu nannunu
(||nīyaṁta||)
niradi ninnĕṟum̐ganu nīvu nannĕṟum̐guduvu
dhara yāsagum̐ḍa nenu dādavu nīvu
varusa nīsum̐ḍa nenu vaiguṁṭhabadivi nīna
narum̐ḍa nenu nīvu nārāyaṇum̐ḍavu
(||nīyaṁta||)
sārĕ nalasum̐ḍa nenu sarvaśhaktivi nīvu
dhīrum̐ḍavu nīvadi dīnum̐ḍa nenu
kāruṇyamūrdivi nīvu kaṭhinasittum̐ḍa nenu
merado nī veligavu mī dāsum̐ḍa nenu
(||nīyaṁta||)
jananaśhīlum̐ḍa nenu janagum̐ḍavu nīvu
ghanavedāṁtanidhivi karmini nenu
aniśhamu śhrīveṁkaḍāsaleṁdrum̐ḍavu nīvu
panula nī saṁkīrdanabarum̐ḍa nenu