(॥పల్లవి॥)
నీవెఱఁగవా యిది నెఱజాణవు
వోవరిలో మమ్మేల వొరసేవు నీవు
(॥॥)
ఆఁడుదానికి సిగ్గులే అందపు సింగారాలు
నీటుతోడ నుండేగుట్టు నిండుసొమ్ము
కూటమిలో వొడికము గురియైన సంపద
గాటమైన వినయము ఘనరాజ్యపదవి
(॥॥)
నేరుపుతో యడఁకువ నిచ్చకల్యాణము
మేరమీర నీగుణము మించైనమేలు
గారవపుటిచ్చకము కందువ నిధానము
సైరణతోడి నడక సతమైన లాభము
(॥॥)
కడలేనియట్టి వాసి కమ్మిన తంగేటిజున్ను
గుడిగొన్న శీలము కొంగుపసిఁడి
యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
కడఁకతో మెలఁకువ కలిమిలో కలిమి
(||pallavi||)
nīvĕṟam̐gavā yidi nĕṟajāṇavu
vovarilo mammela vŏrasevu nīvu
(||||)
ām̐ḍudānigi siggule aṁdabu siṁgārālu
nīḍudoḍa nuṁḍeguṭṭu niṁḍusŏmmu
kūḍamilo vŏḍigamu guriyaina saṁpada
gāḍamaina vinayamu ghanarājyabadavi
(||||)
nerubudo yaḍam̐kuva nichchagalyāṇamu
meramīra nīguṇamu miṁchainamelu
gāravabuḍichchagamu kaṁduva nidhānamu
sairaṇadoḍi naḍaga sadamaina lābhamu
(||||)
kaḍaleniyaṭṭi vāsi kammina taṁgeḍijunnu
guḍigŏnna śhīlamu kŏṁgubasim̐ḍi
yĕḍayaga śhrīveṁkaḍeśha nannu nelidivi
kaḍam̐kado mĕlam̐kuva kalimilo kalimi