నీలో మెలఁగినదాన నేఁడు మాకుఁ గొత్తలా
(॥పల్లవి॥)
నీలో మెలఁగినదాన నేఁడు మాకుఁ గొత్తలా
నీ లాగులన్నియును నే మెఱఁగమా
(॥నీలో॥)
కట్టినది చంద్రగావి, కాయముతట్టుపుణుఁగు
యెట్టెవ్వతెఁ గూడినా నిన్నెఱఁగవచ్చు
పెట్టకు మంతేసియాన బిరుదుబంటవు నీవు
నెట్టుకొన్న నీనిజము నే మెఱఁగమా
(॥నీలో॥)
పొడికప్రము చెక్కుల, పూవులదండలు మేన
కడ నెవ్వతెఁ బొందినాఁ గానఁ గవచ్చు
వొడఁబరచకు మంత వొడయఁడ వందరికి
నిడుపునీగుణాలు నే మెఱఁగమా
(॥నీలో॥)
వోవరి శ్రీవేంకటాద్రి, వురాన నలమేల్మంగ
చేవ నెవ్వతెఁ గూడినాఁ జెప్పఁగఁవచ్చు
కావించకు బాస నాకు శ్రీవేంకటేశ నన్నేలి
నీవోజ లెప్పుడును నే మెఱఁగమా
(||pallavi||)
nīlo mĕlam̐ginadāna nem̐ḍu māgum̐ gŏttalā
nī lāgulanniyunu ne mĕṟam̐gamā
(||nīlo||)
kaṭṭinadi saṁdragāvi, kāyamudaṭṭubuṇum̐gu
yĕṭṭĕvvadĕm̐ gūḍinā ninnĕṟam̐gavachchu
pĕṭṭagu maṁtesiyāna birudubaṁṭavu nīvu
nĕṭṭugŏnna nīnijamu ne mĕṟam̐gamā
(||nīlo||)
pŏḍigapramu sĕkkula, pūvuladaṁḍalu mena
kaḍa nĕvvadĕm̐ bŏṁdinām̐ gānam̐ gavachchu
vŏḍam̐barasagu maṁta vŏḍayam̐ḍa vaṁdarigi
niḍubunīguṇālu ne mĕṟam̐gamā
(||nīlo||)
vovari śhrīveṁkaḍādri, vurāna nalamelmaṁga
seva nĕvvadĕm̐ gūḍinām̐ jĕppam̐gam̐vachchu
kāviṁchagu bāsa nāgu śhrīveṁkaḍeśha nanneli
nīvoja lĕppuḍunu ne mĕṟam̐gamā