నీ మగఁ డిందుకే కదే నీకు మేలువాఁడాయ
(॥పల్లవి॥)
నీ మగఁ డిందుకే కదే నీకు మేలువాఁడాయ
యేమని పొగడవచ్చు నిటువంటి నిన్నును
(॥నీమ॥)
తీగయెలుఁగులు వార తేరకొన నూఁకొనేవు
సోగకనుచూపులను సొలసేవు
లాగులుగా దంతకాంతులను వెన్నెల గాసేవు
చేగదేర నీచేఁతలు చెప్పనెట్టువచ్చునే
(॥నీమ॥)
వొయ్యారిబాగుగాను వొదకిలి కూచుండేవు
గయ్యాళితనమునఁ బక్కన నవ్వేవు
చెయ్య చెక్కిటఁ బెట్టుక సిగ్గులు వెదచల్లేవు
నెయ్యపు విలాసములు నీవే నేరుతువే
(॥నీమ॥)
పలచని కెమ్మోవిఁ బంచదారలు చిందేవు
నిలువెల్లా మురిపేలే నిగిడించేవు
యెలమి శ్రీవేంకటేశు నిన్నిటాఁ జొక్కించితివి
కలికితనాలెల్లాఁ గంటిమే నీవల్లను
(||pallavi||)
nī magam̐ ḍiṁduge kade nīgu meluvām̐ḍāya
yemani pŏgaḍavachchu niḍuvaṁṭi ninnunu
(||nīma||)
tīgayĕlum̐gulu vāra teragŏna nūm̐kŏnevu
sogaganusūbulanu sŏlasevu
lāgulugā daṁtagāṁtulanu vĕnnĕla gāsevu
segadera nīsem̐talu sĕppanĕṭṭuvachchune
(||nīma||)
vŏyyāribāgugānu vŏdagili kūsuṁḍevu
gayyāḽidanamunam̐ bakkana navvevu
sĕyya sĕkkiḍam̐ bĕṭṭuga siggulu vĕdasallevu
nĕyyabu vilāsamulu nīve neruduve
(||nīma||)
palasani kĕmmovim̐ baṁchadāralu siṁdevu
niluvĕllā muribele nigiḍiṁchevu
yĕlami śhrīveṁkaḍeśhu ninniḍām̐ jŏkkiṁchidivi
kaligidanālĕllām̐ gaṁṭime nīvallanu