నే నిన్ను వద్దనేనా నెపాలు వేసేవు గాక
(॥పల్లవి॥)
నే నిన్ను వద్దనేనా నెపాలు వేసేవు గాక
కానిపనే ఇది యేమి కైకొనఁగవలదా
(॥నేని॥)
వనిత కూఁచిపట్టుక వావులెల్లాఁ జెప్పఁగాను
వినవద్దా నీకేల వెడసిగ్గులు
పెనఁగి విడెమియ్యఁగా ప్రేమ నందుకోవద్దా
పనిలేనియాచారాలు పచారించవలెనా
(॥నేని॥)
వువ్విళ్ళూర బుజ్జగించి వొడఁబరచఁగా మెచ్చి
నవ్వవద్దా నీకేల నాలితనాలు
నివ్వటిల్లు సోబనాలు నెరపేది మేలు గాదా
జవ్వనితో చలములు సాదించవలెనా
(॥నేని॥)
నెయ్యపుఁ జుట్టరికము నెరపఁగా నీవునట్టె
ఇయ్యకొనవద్దా నీకేల యెదురాడను
యియ్యెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నాకె-
నొయ్యనే నిన్ను బోదించు టుచితమే కాదా
(||pallavi||)
ne ninnu vaddanenā nĕbālu vesevu gāga
kānibane idi yemi kaigŏnam̐gavaladā
(||neni||)
vanida kūm̐sibaṭṭuga vāvulĕllām̐ jĕppam̐gānu
vinavaddā nīgela vĕḍasiggulu
pĕnam̐gi viḍĕmiyyam̐gā prema naṁdugovaddā
panileniyāsārālu pasāriṁchavalĕnā
(||neni||)
vuvviḽḽūra bujjagiṁchi vŏḍam̐barasam̐gā mĕchchi
navvavaddā nīgela nālidanālu
nivvaḍillu sobanālu nĕrabedi melu gādā
javvanido salamulu sādiṁchavalĕnā
(||neni||)
nĕyyabum̐ juṭṭarigamu nĕrabam̐gā nīvunaṭṭĕ
iyyagŏnavaddā nīgela yĕdurāḍanu
yiyyĕḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nāgĕ-
nŏyyane ninnu bodiṁchu ṭusidame kādā