(॥పల్లవి॥)
నయము గలుగనే నవ్వుదుగాక
రయమునఁ జెనకితే రవ్వకోపునా
(॥నయ॥)
సిగ్గువడి వున్నచెలిఁ జెఱఁగువట్టి తీసేవు
అగ్గలపుఁ గొలువులో నందరుఁ జూడ
నిగ్గుల ప్రౌఢవు నీవు నెలఁత యీపె బాలకి
దిగ్గనఁ గొసరేవు ఇంతేసి కోపునా
(॥నయ॥)
పంతాన నుండిన సతిఁ బచ్చిమాట లాడేవు
అంతరంగ మెఱఁగవు ఆసకాఁడవు
అంతటా సూరుఁడవు నీవాపె గడుముద్దరాలు
చెంతలఁ బెనఁగితే నీచేతికోపునా
(॥నయ॥)
తలమంచుకున్నకాంతఁదమకించి కూడితివి
చలమరి వవుదువు సాదించను
బలిమికాఁడవు నీవు భామ నీకుఁ జనవరి
వెలసె శ్రీవేంకటేశ వేసరఁగ నోపనా
(||pallavi||)
nayamu galugane navvudugāga
rayamunam̐ jĕnagide ravvagobunā
(||naya||)
sigguvaḍi vunnasĕlim̐ jĕṟam̐guvaṭṭi tīsevu
aggalabum̐ gŏluvulo naṁdarum̐ jūḍa
niggula prauḍhavu nīvu nĕlam̐ta yībĕ bālagi
digganam̐ gŏsarevu iṁtesi kobunā
(||naya||)
paṁtāna nuṁḍina sadim̐ bachchimāḍa lāḍevu
aṁtaraṁga mĕṟam̐gavu āsagām̐ḍavu
aṁtaḍā sūrum̐ḍavu nīvābĕ gaḍumuddarālu
sĕṁtalam̐ bĕnam̐gide nīsedigobunā
(||naya||)
talamaṁchugunnagāṁtam̐damagiṁchi kūḍidivi
salamari vavuduvu sādiṁchanu
balimigām̐ḍavu nīvu bhāma nīgum̐ janavari
vĕlasĕ śhrīveṁkaḍeśha vesaram̐ga nobanā