నానా వుపాయముల నన్నుఁ గాచేది పాడి
(॥పల్లవి॥)
నానా వుపాయముల నన్నుఁ గాచేది పాడి
దీనరక్షకుఁడ నాకు దిక్కయి నిలువవే
(॥నానా॥)
శరణు చొచ్చినవాఁడు సర్వాపరాధి యైనాను
పరగఁ దప్పులు మఱి పట్టఁ దగదు
సరవిఁ బాఁతవాఁ డెంత సలిగలఁ బొరలినా
అరసి యందుకుఁగా నలుగఁగఁ దగదు
(॥నానా॥)
పంచ చేరి వున్నవాఁడు పనికిరాకుండినాను
వంచనతో వాని విడువఁగఁ దగదు
కొంచెపడి మొక్కేవాఁడు గుణహీనుఁ డైనాను
అంచెల మొగమాడక అదలించఁ దగదు
(॥నానా॥)
మన్నన బంటైనవాఁడు మందెమేళాన నుండినా
పన్ని మనసున యెగ్గుపట్టఁ దగదు
యిన్ని విధములవాఁడ నిటు నే శ్రీవేంకటేశ
నన్నుఁ గాచుట గాని మిన్నక దూరఁ దగదు
(||pallavi||)
nānā vubāyamula nannum̐ gāsedi pāḍi
dīnarakṣhagum̐ḍa nāgu dikkayi niluvave
(||nānā||)
śharaṇu sŏchchinavām̐ḍu sarvābarādhi yainānu
paragam̐ dappulu maṟi paṭṭam̐ dagadu
saravim̐ bām̐tavām̐ ḍĕṁta saligalam̐ bŏralinā
arasi yaṁdugum̐gā nalugam̐gam̐ dagadu
(||nānā||)
paṁcha seri vunnavām̐ḍu panigirāguṁḍinānu
vaṁchanado vāni viḍuvam̐gam̐ dagadu
kŏṁchĕbaḍi mŏkkevām̐ḍu guṇahīnum̐ ḍainānu
aṁchĕla mŏgamāḍaga adaliṁcham̐ dagadu
(||nānā||)
mannana baṁṭainavām̐ḍu maṁdĕmeḽāna nuṁḍinā
panni manasuna yĕggubaṭṭam̐ dagadu
yinni vidhamulavām̐ḍa niḍu ne śhrīveṁkaḍeśha
nannum̐ gāsuḍa gāni minnaga dūram̐ dagadu