మూసిన ముత్యాన కేలే మొరఁగులు
(॥పల్లవి॥)
మూసిన ముత్యాన కేలే మొరఁగులు
ఆసల చిత్తానకేలే అలవోకలు
(॥మూసిన॥)
కందులేని మోము కేలే కస్తూరి
చిందు నీ కొప్పునకేలే సేమంతులు
మందయానమునకేలే మట్టెలమోఁత
గందమేలే పైపై కమ్మని నీ మేనికి
(॥మూసిన॥)
బారపు గుబ్బలకేలే పయ్యెద నీ-
బీరపుఁ జూపుల కేలే పెడమోము
జీరల బుజాలకేలే చెమటలు నీ-
గోరంట గోళ్ళకేలే కొనవాండ్లు
(॥మూసిన॥)
ముద్దుల మాఁటలకేలే ముదములు నీ-
యద్దపుఁ జెక్కులకేలే అరవిరి
వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు-
నద్దమేలే తిరువేంకటాద్రీశుఁ గూడి
(||pallavi||)
mūsina mutyāna kele mŏram̐gulu
āsala sittānagele alavogalu
(||mūsina||)
kaṁduleni momu kele kastūri
siṁdu nī kŏppunagele semaṁtulu
maṁdayānamunagele maṭṭĕlamom̐ta
gaṁdamele paibai kammani nī menigi
(||mūsina||)
bārabu gubbalagele payyĕda nī-
bīrabum̐ jūbula kele pĕḍamomu
jīrala bujālagele sĕmaḍalu nī-
goraṁṭa goḽḽagele kŏnavāṁḍlu
(||mūsina||)
muddula mām̐ṭalagele mudamulu nī-
yaddabum̐ jĕkkulagele araviri
vŏddiga māḍala kele vūrbulu nīgu-
naddamele tiruveṁkaḍādrīśhum̐ gūḍi