మేలురా నీ వుపాయాలు మెచ్చితి నేను
(॥పల్లవి॥)
మేలురా నీ వుపాయాలు మెచ్చితి నేను
సోలి నాపెను వా(వ్రాసి)సిన సురటిఁ దెమ్మనేవు
(॥మేలు॥)
యేరా నీ వూడిగము సేయించుకొనేయందులోనే
ఆరమణి యద్దము న న్నందిమ్మనేవు
సారె నన్ను నీవు వుపచరించేవానివలెనే
కోరి యాపెచే వీడేము కొమ్మని యిచ్చేవు
(॥మేలు॥)
కైకొని నీ కెంతో పనిగలవానివలెనే
ఆకెపేరిటాపెఁ బిలువు మనేవు నన్ను
జోక నన్ను సింగారించిఁ జూచేవానివలెనే
ఆకాంతపెట్టెలో మెట్టె లంటి తెమ్మనేవు
(॥మేలు॥)
సొలసి చుట్టరికము చూపేవానివలెనే
అలమేల్మంగకు మ్రొక్కు మనేవు నన్ను
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
అలరి యాపె చెల్లెలవై వుండు మనేవు
(||pallavi||)
melurā nī vubāyālu mĕchchidi nenu
soli nābĕnu vā(vrāsi)sina suraḍim̐ dĕmmanevu
(||melu||)
yerā nī vūḍigamu seyiṁchugŏneyaṁdulone
āramaṇi yaddamu na nnaṁdimmanevu
sārĕ nannu nīvu vubasariṁchevānivalĕne
kori yābĕse vīḍemu kŏmmani yichchevu
(||melu||)
kaigŏni nī kĕṁto panigalavānivalĕne
āgĕberiḍābĕm̐ biluvu manevu nannu
joga nannu siṁgāriṁchim̐ jūsevānivalĕne
āgāṁtabĕṭṭĕlo mĕṭṭĕ laṁṭi tĕmmanevu
(||melu||)
sŏlasi suṭṭarigamu sūbevānivalĕne
alamelmaṁgagu mrŏkku manevu nannu
yĕlami śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
alari yābĕ sĕllĕlavai vuṁḍu manevu