మేలు మేలు యిదే బుద్ధి మెలఁతల కెల్లాను
(॥పల్లవి॥)
మేలు మేలు యిదే బుద్ధి మెలఁతల కెల్లాను
నీ లీల లన్నియు మాకు నేరుపఁగదే
(॥॥)
పతికి నిచ్చక మాడి భావము గరఁగించేవు
కతకారి వవుదువే కలికి
అతివినయాలు చూపి అట్టే సేవలు సేసేవు
చతురత లెల్లా నేర్చి జాణ వైతివే
(॥॥)
సెలవి నవ్వులు నవ్వి చేతికి వీడె మిచ్చేవు
వలపించ నోపుదువే వనిత
నిలువుఁ గొలువు సేసి నెట్టనఁ దమి రేఁచేవు
పలుకుఁ బంతములకుఁ బంతగత్తె వవుదువే
(॥॥)
యిచ్చట శ్రీ వేంకటేశు నెదపై నెలకొంటివి
మెచ్చులాఁడివే అలమేలుమంగా
అచ్చముగ మమ్ము నేలుమని యప్పణిచ్చితివి
కచ్చుపెట్టి నీవు దయగలదాన వవుదువే
(||pallavi||)
melu melu yide buddhi mĕlam̐tala kĕllānu
nī līla lanniyu māgu nerubam̐gade
(||||)
padigi nichchaga māḍi bhāvamu garam̐giṁchevu
kadagāri vavuduve kaligi
adivinayālu sūbi aṭṭe sevalu sesevu
sadurada lĕllā nersi jāṇa vaidive
(||||)
sĕlavi navvulu navvi sedigi vīḍĕ michchevu
valabiṁcha nobuduve vanida
niluvum̐ gŏluvu sesi nĕṭṭanam̐ dami rem̐sevu
palugum̐ baṁtamulagum̐ baṁtagattĕ vavuduve
(||||)
yichchaḍa śhrī veṁkaḍeśhu nĕdabai nĕlagŏṁṭivi
mĕchchulām̐ḍive alamelumaṁgā
achchamuga mammu nelumani yappaṇichchidivi
kachchubĕṭṭi nīvu dayagaladāna vavuduve