మేటి నేరుపరులాల మెలుఁతలాల
(॥పల్లవి॥)
మేటి నేరుపరులాల మెలుఁతలాల
కూటము లిద్దరికినిఁ గూరుచరె యెపుడు
(॥మేటి॥)
చెప్పఁగానే నోరూరీ చెలువునిచేఁతలు
చొప్పులెత్తెతని నాకుఁ జూపఁ గదరే
కుప్పవడీ గోరికలు గుణములు వింటేను
వొప్పుగాఁ బొందులు నాకు నొనరించరే
(॥మేటి॥)
విననే వేడుకవుట్టీ విభుని చక్కఁదనాలు
అనువుగా నిద్దరి మాటాడించరే
మనసయ్యా నాతనిమంచితనాలు చూడఁగా
యెనయఁగ నాతని నింటికిఁ దోడితేరే
(॥మేటి॥)
తలఁచఁగానే వచ్చె తానె శ్రీవేంకటేశుఁడు
తెలుపరే నామోహము దేవునికిని
తిలకించి చూచి ఇట్టె తిరముగాఁ బెండ్లాడె
కలకాలమును నన్నుఁ గరుణించుమనరే
(||pallavi||)
meḍi nerubarulāla mĕlum̐talāla
kūḍamu liddariginim̐ gūrusarĕ yĕbuḍu
(||meḍi||)
sĕppam̐gāne norūrī sĕluvunisem̐talu
sŏppulĕttĕdani nāgum̐ jūbam̐ gadare
kuppavaḍī gorigalu guṇamulu viṁṭenu
vŏppugām̐ bŏṁdulu nāgu nŏnariṁchare
(||meḍi||)
vinane veḍugavuṭṭī vibhuni sakkam̐danālu
anuvugā niddari māḍāḍiṁchare
manasayyā nādanimaṁchidanālu sūḍam̐gā
yĕnayam̐ga nādani niṁṭigim̐ doḍidere
(||meḍi||)
talam̐sam̐gāne vachchĕ tānĕ śhrīveṁkaḍeśhum̐ḍu
tĕlubare nāmohamu devunigini
tilagiṁchi sūsi iṭṭĕ tiramugām̐ bĕṁḍlāḍĕ
kalagālamunu nannum̐ garuṇiṁchumanare