మగువ నీ కెదు రేదీ మాటలాడఁబోతేను
(॥పల్లవి॥)
మగువ నీ కెదు రేదీ మాటలాడఁబోతేను
పగటు చిలుకలకు పలుకులు దరిగే
(॥మగువ॥)
చక్కని వదన మది సారెకు నీ వెత్తఁ గాను
చుక్కలరాయని సూటి దరిగె
యెక్కడో నీవు చూడఁగ ఇంచువిలుతునితూపు
వుక్కుమీరి కొట్టఁ గొనను వాఁడి దరిగే
(॥మగువ॥)
పయ్యదే బయలు చేసి పగటులు నెరపఁగా
కొయ్యజక్కవలలోనే గుట్టు దరిగే
వొయ్యనే నీ బొమ్మ లార్చి వొరపులు చూపఁగాను
తియ్యవిలుతునివింటితీపు దరిగే
(॥మగువ॥)
తళుకున నవ్వు నవ్వి తమ్ములము సేయఁగాను
తెలుపు వెన్నెలలోనితేట దరిగే
వొలిసి శ్రీవేంకటేశు వురముపై నెక్కఁ గాను
కలికి మెఱుఁగులు కళ లెల్లాఁ దరిగే
(||pallavi||)
maguva nī kĕdu redī māḍalāḍam̐bodenu
pagaḍu silugalagu palugulu darige
(||maguva||)
sakkani vadana madi sārĕgu nī vĕttam̐ gānu
sukkalarāyani sūḍi darigĕ
yĕkkaḍo nīvu sūḍam̐ga iṁchuviludunidūbu
vukkumīri kŏṭṭam̐ gŏnanu vām̐ḍi darige
(||maguva||)
payyade bayalu sesi pagaḍulu nĕrabam̐gā
kŏyyajakkavalalone guṭṭu darige
vŏyyane nī bŏmma lārsi vŏrabulu sūbam̐gānu
tiyyaviluduniviṁṭidību darige
(||maguva||)
taḽuguna navvu navvi tammulamu seyam̐gānu
tĕlubu vĕnnĕlalonideḍa darige
vŏlisi śhrīveṁkaḍeśhu vuramubai nĕkkam̐ gānu
kaligi mĕṟum̐gulu kaḽa lĕllām̐ darige