మగరూపు గైకొన్న మగువవంటివాఁడవు
(॥పల్లవి॥)
మగరూపు గైకొన్న మగువవంటివాఁడవు
నిగుడి నిన్ను గెలువ నేఁడు మా తరమా
(॥మగ॥)
మాటలునీవాడఁగానే మచ్చికలు నోరూరి
తేటల నీచేఁత లెంత తియ్య నుండునో
ఆఁటదాన నే నింత అన్నిటానుఁ జొక్కితిని
పాటించి పురుష లెంత భ్రమతురో యింకాను
(॥మగ॥)
పొంచి నీవు నవ్వఁగానే పులకించె నామేను
చంచున నీ కౌఁగి లెంత చలిగొనునో
మంచిదే యిల్లాలను మరిగితి ని న్నింత
అంచల వెలయాండ్లకు నాస యెంత వుట్టునో
(॥మగ॥)
గక్కనఁ గౌఁగిలించఁగాఁ గడుఁ దరితీపు వుట్టె
చక్కని నీమోవి యెంత చవివుట్టునో
యెక్కువ శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
దిక్కులవా రెంత నిన్ను తేలి పొందవత్తురో
(||pallavi||)
magarūbu gaigŏnna maguvavaṁṭivām̐ḍavu
niguḍi ninnu gĕluva nem̐ḍu mā taramā
(||maga||)
māḍalunīvāḍam̐gāne machchigalu norūri
teḍala nīsem̐ta lĕṁta tiyya nuṁḍuno
ām̐ṭadāna ne niṁta anniḍānum̐ jŏkkidini
pāḍiṁchi puruṣha lĕṁta bhramaduro yiṁkānu
(||maga||)
pŏṁchi nīvu navvam̐gāne pulagiṁchĕ nāmenu
saṁchuna nī kaum̐gi lĕṁta saligŏnuno
maṁchide yillālanu marigidi ni nniṁta
aṁchala vĕlayāṁḍlagu nāsa yĕṁta vuṭṭuno
(||maga||)
gakkanam̐ gaum̐giliṁcham̐gām̐ gaḍum̐ daridību vuṭṭĕ
sakkani nīmovi yĕṁta savivuṭṭuno
yĕkkuva śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
dikkulavā rĕṁta ninnu teli pŏṁdavatturo