కొమ్మకు నీ విట్టే పెండ్లికొడుకవై వచ్చితివి
(॥పల్లవి॥)
కొమ్మకు నీ విట్టే పెండ్లికొడుకవై వచ్చితివి
ఇమ్ముల సిగ్గువడక యేలుకోవయా
(॥కొమ్మ॥)
పుత్తడివంటిది యీ పొలఁతి చక్కఁదనము
చిత్తరువువంటిది మించిన రూపము
క్రొత్తమెఱుఁగువంటిది కోమలపు దేహము
చిత్తగించవయ్యా యీకె సింగారము
(॥కొమ్మ॥)
పూవుఁదీగెవంటిది పొలుపైన యీకె తీరు
వావిరి బైఁడిసలాకవంటిది రేక
సోవఁ జిగురువంటిది చూచితేను నిలువెల్లా
వేవేగఁ జూడవయ్యా యీ విలాసము
(॥కొమ్మ॥)
వన్నెల నాణిముత్తెమువంటిది తన పోలిక
వెన్నెల సోగవంటిది వింత భావము
యిన్నిటా శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
వున్నతి మెచ్చవయ్యా యీ వొయ్యారము
(||pallavi||)
kŏmmagu nī viṭṭe pĕṁḍligŏḍugavai vachchidivi
immula sigguvaḍaga yelugovayā
(||kŏmma||)
puttaḍivaṁṭidi yī pŏlam̐ti sakkam̐danamu
sittaruvuvaṁṭidi miṁchina rūbamu
krŏttamĕṟum̐guvaṁṭidi komalabu dehamu
sittagiṁchavayyā yīgĕ siṁgāramu
(||kŏmma||)
pūvum̐dīgĕvaṁṭidi pŏlubaina yīgĕ tīru
vāviri baim̐ḍisalāgavaṁṭidi rega
sovam̐ jiguruvaṁṭidi sūsidenu niluvĕllā
vevegam̐ jūḍavayyā yī vilāsamu
(||kŏmma||)
vannĕla nāṇimuttĕmuvaṁṭidi tana poliga
vĕnnĕla sogavaṁṭidi viṁta bhāvamu
yinniḍā śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
vunnadi mĕchchavayyā yī vŏyyāramu